హైదరాబాద్: ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jathara) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. ఫిబ్రవరి 4 వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. వనమే ఆలంబనగా అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలందరూ జరుపుకునే వేడుక నాగోబా జాతర అని, గిరిజన సోదర, సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణ సాంస్కృతిక వైభవమని పేర్కొన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుకలో ఆధ్యాత్మక వెలుగులు నింపే ఆదిశేషువు కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
వనమే ఆలంబనగా అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలందరూ జరుపుకునే వేడుక “నాగోబా జాతర” సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు గిరిజన సోదర, సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం… pic.twitter.com/rhF6YIgRSa
— Telangana CMO (@TelanganaCMO) January 28, 2025
గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతరను ఆదివాసీ, గిరిజనులు ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో ప్రభుత్వం సుమారు 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది.
ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య సందర్భంగా గిరిజనుల ఇలవేల్పు నాగోబా మహాపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం మెస్రం వంశీయులు నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేపడతారు. కాలినడకన సుమారు 250 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తీసుకువచ్చిన పవిత్ర గోదావరి జలాలలో నాగోబాకు అభిషేకం, మహాపూజ చేయడంతో ఈ ఇక్కడ జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది.
ఇప్పటికే నాగోబా అభిషేకానికి కావాల్సిన పవిత్ర గంగా జలాలను తీసుకొని కేస్లాపూర్ కు వచ్చిన మెస్రం వంశీయులు ఆలయ సమీపంలోని మర్రి చెట్టు వద్ద విడిది చేసి ఉన్నారు. మంగళవారం రాత్రి అక్కడి నుండి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో వాయిద్యాలతో ఆలయానికి చేరుకుంటారు. అనంతరం మెస్రం వంశీయులు, కట్టోడాలు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో తయారు చేయించిన కుండలను మాత్రమే గిరిజనులు ఇక్కడ పూజలకు వినియోగించడం ఆనవాయితీగా వస్తుంది.