హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రభుత్వం సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో కమిటీ నియమించింది. సహాయక చర్యల పర్యవేక్షణతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను కమిటీకి అప్పగించింది. ఈ కమిటీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్టుమెంట్ పీఎస్, హెల్త్ సెక్రెటరీ, ఫైర్సర్వీసెస్ అడిషనల్ డీజీని సభ్యులుగా నియమించింది. ఇక ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై డీజీపీ, సీఎస్‌తో సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయికి వెళ్లిన మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేటి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి పాశమైలారంలో ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం దురదృష్టకరమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.