Congress | ‘దొంగోలె వచ్చే కరెంటితో ఎవుసం ఎట్ల జేద్దు ? సంసారం ఎట్ల జేద్దు ? కాలిపోయిన మోటరెత్తుకు పట్నం ఎట్ల పోవాలె? ఈ పరేషాన్ ఎట్ల పోవాలె?’
…. అంటూ దశాబ్దం కిందట కన్నీళ్లను కైగట్టుకొని కరెంటు మీద పాటపాడుకున్నది తెలంగాణ. కరెంటు కోతలు, చార్జీల వాతల నడుమ తెలంగాణ రైతు చేసింది అక్షరాలా కన్నీటి సేద్యం. కరెంటు చావుల వార్త వినబడని రోజు లేదు. పొలాలకు నీళ్లివ్వలేకపోయిన కాంగ్రెస్ సర్కారు కరెంటుకూ కనికరించలేదు. ఇచ్చేది అర్ధరాత్రి మూడుగంటల కరెంటు.. కరెంటు.. అందులోనూ అప్రకటిత కోతలు. కాలిపోయే మోటర్లు.. ట్రాన్స్”ఫార్మర్’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిమ్మచీకట్లలో రైతుల్ని బాయికాడికి తిప్పింది కాంగ్రెస్ సర్కార్. పాముకాటుకు, తేలుకాటుకు బలి చేసి, వేలాది అన్నదాతల కుటుంబాల్లో అమాస చీకట్లను నింపింది. అదే కాంగ్రెస్.. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును అటకెక్కించాలని అంటున్నది. పాతరోజులు, పాముకాట్లు, రైతుపాట్లు తిరిగిరావాలని, అప్పట్లో తాము ప్రసాదించిన మూడు గంటల కరెంటు దరిద్రాన్నే.. తిరిగి తెలంగాణ నెత్తిన రుద్దాలని కోరుకుంటున్నది.
బాయిలకాడ కరెంట్ లేక మనం ఎంత గోస పడ్డమో అందరి అనుభవంలోనే ఉన్నది. నాటి గోసను గుర్తు చేసుకొంటే కండ్లల్లో నీళ్లు తిరుగుతయ్. ఆ కష్టాలు మళ్లీ రావొద్దని దేవుణ్ని మొక్కుతా..
-ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న కరెంట్ కష్టాలపై పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి అప్రకటికత కరెంట్ కోతలు.. అర్ధరాత్రి కరెంట్ షాక్‌తో చనిపోయిన రైతు.. కరెంట్ కోతలను నిరసిస్తూ రొడ్డెకిన్న అన్నదాతలు.. కరెంట్ కోతలతో ఎండుతున్న పంటలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. రైతుల మోటర్లు.. ఇవీ.. ఉమ్మడి రాష్ట్రంలో తెల్లారి లేస్తే న్యూస్ పేపర్లు, చానళ్లలో వినిపించిన, కనిపించిన వార్తలు. నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనలో రైతులు ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే నాటి వార్తా పత్రికలను తిరగేస్తే సరిపోతుంది. అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండి రైతుల బతుకులు ఆగమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వ్యవసాయం చేయాలంటేనే జడిసే పరిస్థితి ఏర్పడింది. తెల్లవారితే ఏ రైతన్న మరణవార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఉండేది.

కాంగ్రెస్ పాలనలో చీకట్లో బావుల వద్దకు పోతున్న రైతులు
కరెంట్ కోతలు.. కన్నీటి సాగు
కాంగ్రెస్..టీడీపీ పాలన ఎవరిదైనా తెలంగాణ రైతులకు మాత్రం కరెంట్ కోతలు తప్పేవి కావు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ ఇస్తున్నట్టు ప్రకటనలు గుప్పించడమే తప్ప క్షేత్రస్థాయిలో మూడు నుంచి నాలుగు గంటల కరెంట్ కూడా వచ్చేది కాదు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ ఇచ్చేవాళ్లు. ఈ అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు పంటలు సాగు చేయలేని దుర్భర పరిస్థితి. సాగునీరు అందక పంటలు ఎండిపోయేవి. రైతుకు చివరికి గుండె కోత మిగిలేది. కరెంట్ కోతలతో, సాగునీరు లేక కండ్ల ముందు పంటలు ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోయేవి. అప్పోసొప్పొ చేసి సాగు చేసిన పంట ఎండిపోవడంతో పెట్టుబడి కూడా మీద పడేది.
అర్ధరాత్రి కరెంట్‌తో ఆగిన గుండెలెన్నో..
కరెంట్ కోతలు రైతులకు నష్టాల్నే కాదు.. రైతు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చేవి. కరెంట్ వైర్లే యమపాశాలై పెద్ద దిక్కును మింగేసి అనేక కుటుంబాలను అనాథలను చేశాయి. ఇచ్చేదే నాలుగైదు గంటల కరెంట్.. ఇందులో సగం రాత్రి పూటే ఇచ్చేవారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో రాత్రిళ్లు పొలాల దగ్గరికి వెళ్లాల్సిన వచ్చేది. రైతులు రోజూ శివరాత్రి జాగరమే చేసేవాళ్లు. చీకట్లో పాములు కరవడం, కరెంట్ షాక్‌తో వేల మంది రైతులు చనిపోయారు. ఏటా 600 మందికిపైగా రైతులు అర్ధరాత్రి కరెంట్‌కు బలయ్యేవారని అంచనా. అంటే నెలకు 50 మంది చొప్పున రోజుకు సగటున ఇద్దరు రైతులు కరెంటుకు బలయ్యేవారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు రైతువేదిక వద్ద కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు
నిత్యం కాలిపోయే మోటర్లు.. ట్రాన్స్ఫార్మర్లు
ఉమ్మడి పాలనలో లో-వోల్టేజీ కరెంటుతో మోటర్లు.. స్టాటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయించేందుకు దిక్కుమొక్కు లేకుండా పోయేది. కరెంట్ అధికారులు రాకపోయేవారు. దీంతో పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులే తలా కొన్ని పైసలు జమచేసి ట్రాన్స్ఫార్మర్లను బాగు చేయించుకునేవారు. ఇలా నెలకు కనీసం రెండుసాైర్లెనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. ఒక్కోసారి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యేవి. దీనికి తోడు కరెంట్ సమస్యతో రైతుల మోటర్లు, స్టార్లర్లు కలిపోయేవి. వీటిని బాగు చేయించుకోవడం రైతులకు తలకుమించిన భారమయ్యేది. ఒక్కో గ్రామంలో ప్రతిరోజు కనీసం 10 మోటర్లు కాలిపోయేవి.
ఉచిత విద్యుత్తు మాయ
ఉచిత విద్యుత్తుపై పేటెంట్ మాదేనంటూ, మేమే రైతులకు కరెంట్ ఇచ్చామంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ నేతలు, నాటి కాంగ్రెస్ పాలనలో రైతులను పెట్టిన ఇబ్బందులపై మాత్రం నోరు విప్పడం లేదు. ఉచిత వి ద్యుత్తు మాటున చేసిన మోసంపై మాట కూడా మాట్లాడటం లేదు. తొలుత వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామంటూ ప్రచారం చేసి, ఆ తర్వాత తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వాస్తవంగా 3-4 గంటలకు మించి కరెంటు ఇచ్చేవారు కాదు.
కోతలపై రైతుల ధర్నాలు, ముట్టడులు..
ఇచ్చేదే అరకొర విద్యుత్తు, అపై లో ఓల్టేజీతో మోటర్ల కాలిపోవుడు.. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకునేది. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నిత్యం ఏదో ఒక గ్రామంలో రైతులు ధర్నాలు చేసేవారు. సబ్ స్టేషన్లు, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి షరా మామూ లు వ్యవహారంగా ఉండేది. కష్టాలు చెప్పుకొనేందుకు రోడ్డెక్కిన రైతులపై నాటి ప్రభుత్వాలు పాశవికంగా లాఠి చార్జీలు చేయించేవి. కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా ర్యాలీ తీసిన రైతులను నాటి చంద్రబాబు ప్రభుత్వం కాల్చి చంపిన ఘటనను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. కరెంట్ కోసం రైతులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఉదంతాలున్నాయి.