హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే.. ప్రభుత్వంలో ఏయే పథకాలు అమలు జరుగుతున్నాయి? కొత్తగా ఏయే పథకాలు అమల్లోకి వచ్చాయి? గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో వేటిని రద్దు చేశారు? అనేది కనీస అవగాహన కలిగి ఉండాలి. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో కూడా కనీస అవగాహన లేని, జ్ఞాపకం లేని పరిస్థితి నెలకొన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం తమిళనాడు పర్యటనలో రేవంత్‌రెడ్డి చేసిన ఓ ప్రకటన.
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ అనే కార్యక్రమానికి గురువారం సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాల్లో పేద పిల్లలకు ఉదయం అల్పాహారం అందించే పథకం తన హృదయాన్ని తట్టిందని, ఇది చాలా గొప్ప పథకం అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను స్పూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
బ్రేక్‌ఫాస్ట్‌తో పేద విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని కొనియాడారు. అయితే రేవంత్‌రెడ్డి తమిళనాడులో అబ్బురం అంటూ పొగడ్తల వర్షం కురిపించిన పథకాన్ని మూడేండ్ల కిందటనే అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం ఖాళీ కడుపుతో బడికి వచ్చే విద్యార్థుల ఆకలిని తీర్చడంతోపాటు విద్యార్థుల పోషకాహార లోపాన్ని తగ్గించి, హాజరును పెంచడం కోసం కేసీఆర్ ఆలోచనతో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ పేరుతో అమల్లోకి తీసుకువచ్చారు.
2023 అక్టోబర్ 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ పథకం ప్రారంబించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతీరోజు ఉచిత అల్పాహారం అందించడం ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని అమలు చేశారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రద్దు చేశారు. పేద విద్యార్థులు ఆకలికి ఇబ్బంది పడుతారనే కనీస ఆలోచన చేయకుండా రెండేండ్లుగా ఆ పథకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు తమిళనాడులో చూసి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో కూడా మొదలు పెడతామంటూ రేవంత్‌రెడ్డి ప్రకటించటంతో ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలన్న యావేతప్ప… అసలు ఆ పథకమేమిటి? దాని ప్రయోజనమేమిటి? అనేది కూడా ఆలోచించకుండా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రేవంత్ రద్దు చేసినట్టు అర్థమైతున్నదని నెటిజన్లు మండిపడుతున్నారు.
తాను రద్దు చేసిన పథకమే తమిళనాడులో చూసిన తర్వాత నచ్చిందా అని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం ఎవరితరమూ కాదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వంలో ఏ పథకం అమలు జరుగుతున్నదో, ఏ పథకం రద్దు చేశారో ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం విడ్డూరమని విమర్శలు గుప్పిస్తున్నారు.