Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భూ వివాదాల్లేని తెలంగాణ తెస్తామని, భూ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శిల్పకళా వేదికలో సోమవారం ఆయన భూభారతి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థను, అధికారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యవస్థలోనైనా 10 శాతం చెడ్డవాళ్లు ఉంటారని, తాము చట్టాలు చేసినప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సింది రెవెన్యూ అధికారులేనని రేవంత్ అన్నారు. ‘మా ప్రభుత్వం మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నది. మీరు, మేము వేర్వేరు కాదు. మేం చేసిన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. ప్రభుత్వానికి రైతులు, రెవెన్యూశాఖ రెండు కళ్లలాంటివి’ అని అన్నారు. రెవెన్యూ అధికారులు ఏ తప్పూ చేయొద్దని, పక్కాగా చట్టాన్ని అమలు చేద్దామని సూచించారు.
‘మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. ఎవరి భూమి వారికి లెక్క రాద్దాం’ అని చెప్పారు. మనుషులకు ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూధార్ నంబర్ తీసుకొస్తామని, ప్రతి రైతు భూమికి ఆ నంబర్ ఇస్తామని చెప్పారు. తెలంగాణ సరిహద్దులనే నిర్ణయించిన రెవెన్యూ అధికారులు.. రైతుల భూమి హద్దులు నిర్ణయించలేరా అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. ఇవే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. కలెక్టర్లు ప్రతిరోజు రెండు మండలాల్లో రెవెన్యూ సదస్సులకు హాజరై ప్రజలకు భూభారతిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వ భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ఆ భూములపై హక్కు కల్పించేందుకు అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరించి అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హత కలిగిన పేదవారికిప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తుందని ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భూభారతి 2025 చట్టం వందేళ్లు వర్ధిల్లుతుందని అన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతిని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.