సిద్దిపేట, జనవరి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగులు పీఆర్సీ అడిగితే ఏసీబీ దాడులతో కాంగ్రెస్ సర్కార్ భయపెడుతున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం రూ.30 వేల కోట్లు చెల్లిస్తున్న రేవంత్‌రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చేందుకు మాత్రం మనసు రావడం లేదని విమర్శించారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై వారిని సత్కరించి మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 72శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకున్నదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదని.. మాట్లాడినా, ప్రశ్నించినా ఏసీబీ దాడులు చేయిస్తున్నదని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ.1,400 కోట్లు ఉంటే, దానిని రూ.2,400 కోట్లకు పెంచి వాటినే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారని, ఇందులో ప్రభుత్వ ఘనకార్యమేమీ లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే, నెల రెండు నెలల్లోనే అన్ని బెనిఫిట్లు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ, నేడు కమిషన్లు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులొచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే, రేవంత్‌రెడ్డి మాత్రం అంధకారంలోకి నెట్టి దివాలా తీయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతో సిద్దిపేటలో మెడికల్, వెటర్నరీ కాలేజీ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్క్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, సీహెచ్ అంజిరెడ్డి వెల్లడించారు. 18 నెలలుగా 18వేల మందికి రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదని తెలిపారు. పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ధర్నాకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు ప్రకటించింది. 24 గంటలపాటు నిర్వహించే ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య ప్రకటనలో తెలిపారు.