ప్రోరేటా ప్రకారం వరద జలాల్లో లెక తేలాక పైన మేం కట్టుకుంటాం. కింద మీరు కట్టుకోండి. లెక తేలితే బురద ఉందా? వరద ఉందా? తేలుతుంది కదా. గోదావరి రివర్ బోర్డు ముందే మీరేం కట్టాలనుకుంటున్నరు, మేమేం కట్టాలనుకుంటున్నామో చర్చిద్దాం. మీకు పతార ఉందని పైకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా? మోదీ మేం చెప్పింది వింటాడని పై నుంచి కిందకు వస్తారా? న్యాయపరంగానే బనకచర్లపై పోరాడుతున్నాం. మేం అందరి దగ్గరికీ వెళ్తున్నాం. వ్యూహం లేకుండానే ఇంత దూరం వచ్చామా?’ .. ఇవీ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు. అంటే బనకచర్ల ప్రాజెక్టును, వక్రమార్గాన అనుమతులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు హడావుడి చేశారు. కానీ కొన్నాళ్లకే మాట మార్చేశారు. ఏపీకంటే ముందే చర్చలంటూ ఆరాటపడుతున్నారు. చంద్రబాబుతో అనుబంధం కోసం తెలంగాణ నీటిహక్కులను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు, తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ సమాజం మొత్తుకుంటున్నా ఆయన చెవికెక్కించుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తిశాఖకు సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏతోపాటు, కృష్ణా, గోదావరి రివర్‌బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలను కోరింది. బనకచర్ల లింక్ ప్రాజెక్టు పీఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. ఈ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గోదావరిలో మిగులు జలాలే లేవని ఎన్‌డబ్ల్యూడీఏ తేల్చిచెప్పింది.
బనకచర్ల ప్రాజెక్టును చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని, కాబట్టి ఇందుకు అన్ని రాష్ర్టాల అనుమతి తప్పనిసరి అని, ప్రాజెక్టుకు టీఏసీని మళ్లీ తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) స్పష్టం చేశాయి. ప్రాజెక్టు పూర్తిగా టీఏసీ నిబంధనలకు విరుద్ధమని బేసిన్‌లోని ఇతర రాష్ర్టాలతో పాటు తెలంగాణ అధికారులు కూడా పేర్కొంటున్నారు. కేంద్రానికి లేఖలు రాశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచించగలమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్రానికి స్పష్టం చేసింది. ఇలా కేంద్ర సంస్థలన్నీ బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాయి. కానీ కేంద్రం మాత్రం ఏపీ ఒత్తిడితో ప్రాజెక్టుపై ముందుకే సాగుతున్నది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200టీఎంసీల జలాలను తరలించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. డీపీఆర్‌ను సిద్ధం చేయడంతోపాటు, రెండుమూడు రోజుల్లోనే కేంద్రానికి సమర్పించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ, ఏపీ భేటీ.. కేంద్ర మంత్రి హామీ
ప్రాజెక్టుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు తొలిదశ పర్యావరణ అనుమతుల మంజూరు కోసం దరఖాస్తు చేసింది. టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) కోసం కేంద్ర అటవీ, పర్యావరణమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రివర్ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీకి (ఈఏసీ) ప్రతిపాదనలను సమర్పించింది. జీకే చక్రపాణి నేతృత్వంలో ఈఏసీ మాత్రం ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. టీవోఆర్ జారీకి నిరాకరించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదించి గోదావరిలో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుని, అవసరమైన అనుమతులను తీసుకున్న తరువాతనే టీవోఆర్ కోసం ప్రతిపాదనలను పంపించాలని ఈఏసీ తేల్చిచెప్పింది. దీంతో వెంటనే ఈ విషయంపై కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. త్వరలోనే రెండు రాష్ర్టాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వివాదాన్ని పరిష్కరిస్తామని ఏపీ సీఎం బాబుకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే 16వ తేదీన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సీఎంలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం.
రేవంత్‌రెడ్డికి అమిత ఉత్సాహం
ఒకవేళ ప్రాజెక్టు అవసరమని భావిస్తే కేంద్ర సూచన మేరకు ఏపీ సీఎం వచ్చి తెలంగాణ సీఎంతో చర్చలు జరుపుతారు. కానీ దీనికి భిన్నంగా ఏపీ సీఎం బహిరంగంగా ఎక్కడా కోరకపోయినా చర్చలు జరిపేందుకు రేవంత్ రెడ్డి ఆరాట పడుతున్నట్టు విమర్శిస్తున్నారు. పైగా పూటకో మాట.. రోజుకో లెక్క చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తానే చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని తొలుత రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే సరిపోతుందని, ఆ తరువాత బనకచర్లను అంగీకరిస్తామని చెప్పారు. విమర్శలు రావడంతో ప్రాజెక్టును అడ్డుకుంటామని ఆ తరువాత ప్రకటించారు. కానీ ఇటీవల మళ్లీ రేవంత్‌రెడ్డి మాట మార్చారు.
వరద జలాల్లో లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్న తరువాత బురద ఉందా.. వరద ఉందో తేలుతుందని, ఎవరేం కట్టాలంటున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దాం అంటూ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అంతేకాదు “పతార ఉందని పైకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా అని, మోదీ మేం చెప్పింది వింటాడని పై నుంచి కిందకు వస్తారా? అని ప్రశ్నించారు. న్యాయపరంగానే బనకచర్లపై పోరాడుతున్నామని, మేం అందరి దగ్గరికీ వెళ్తున్నామని” అంటూ సీఎం ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టుపై ఏపీ ముందుకు పోకుండా నిలువరించడం కన్నా బాబుతో చర్చల కోసం రేవంత్‌రెడ్డి తహతహలాడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి నేతృత్వంలో 16న ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో బాబుతో భేటీ అయ్యేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి వివాదాలపై సమావేశంలో చర్చ ఉంటుందని పైకి చెబుతున్నా, బనకచర్ల కోసమేనని నీటిపారుదలశాఖ అధికారులే వెల్లడిస్తున్నారు.
16న ఢిల్లీలో అనధికార అపెక్స్
ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి అత్యున్నతస్థాయిలో ఏర్పాటయిందే అపెక్స్ కౌన్సిల్. ఇందులో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. 2016లో మొదటిసారిగా, 2020లో రెండో సమావేశం కొనసాగింది. జలవివాదాలకు సంబంధించిన అంశాలపై రివర్బోర్డుల్లో చర్చించిన అనంతరం, అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోతే సదరు బోర్డులు అపెక్స్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తాయి. అప్పుడు కేంద్రం ఇరు రాష్ర్టాలను సంప్రదించి ఏజెండా అంశాలను కోరి, ఆ తరువాత అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఖరారు చేస్తుంది. కానీ తాజాగా అలాంటిదేమీ లేకుండానే కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేరుగా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో హడావుడిగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏపీ సీఎం చంద్రాబాబు నాయుడు పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 14న ఢిల్లీ వెళ్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. 16వరకు అక్కడే ఉండనున్నారని తెలిపాయి. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 14వ తేదీ కాకుండా మరోతేదీన సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రిని కోరారు. దీంతో 16న తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
రేవంత్ సర్కార్ కవరింగ్..
కేంద్రజలశక్తిశాఖ సమావేశంలో చర్చించే అంశాలపై సీఎంవో ముందుగానే ఒక నోట్‌ను విడుదల చేసింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, రాష్ర్టానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఆ మేరకు వెల్లడించారు. కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబడుతామని వెల్లడించారు. కానీ బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఏపీని నిలదీస్తామని మాత్రం అందులో ఎక్కడా పేర్కొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.