ఖైరతాబాద్, మే 29: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతామనంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ నైతిక అర్హత లేదని సీనియర్ జర్నలిస్టు పాశంయాదగిరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ బిల్లు పెడితే, తెలంగాణ కోసం నాటి కాంగ్రెస్ నేతలు ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, చిన్నారెడ్డి త దితరులు పోరాడారని గుర్తుచేశారు. తెలంగాణ ఆవిర్భావవేడుకలు నిర్వహించే నైతిక అర్హత కూడా వారికున్నదని అన్నారు. రెండు కండ్ల సిద్దాంతాన్ని నమ్మే మాజీ సీఎం చంద్రబాబుకు సహచరుడినని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి ఉద్యమకారుల త్యాగాలు, రాష్ర్టావిర్భావ విలువలు తెలియవని అన్నారు. నేటి కాంగ్రెస్ సర్కారు హయాంలో తెలంగాణ కోసం పోరాడిన వారిని అవమానిస్తున్నారని, ద్రోహం చేసిన వారిని సన్మానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ స్తూపం కట్టిన ఎక్కా యాదగిరి, సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ వద్ద అమరుల స్తూపం కట్టిన సింహా పరిస్థితి దారుణంగా ఉన్నదని, అలాంటి వారి ని సన్మానించుకోవాలని చెప్పారు. అం దెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆం ధ్రా సంగీత దర్శకుడిని పెడుతున్నారని, ఉద్యమ ద్రోహులందరికీ టికెట్లు ఇచ్చారని, లోగోను మార్చాలనుకుంటే.. చాకలి ఐలమ్మ బొమ్మ పెట్టాలని సూచించారు. ఓ కమిటీ వేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ముందుగా వారిపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేయాలని, అందుకు ఓ కమిటీ వేయాలని సూచించారు.