హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉపఎన్నికల్లో మరోసారి టికెట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. మరో సీనియర్ నేత అంజన్‌కుమార్ మూడు పర్యాయాలు సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఏఐసీసీ నేతలతో మంచి సంబంధాలున్న నాయకుడు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రకటించారు. కానీ కొన్నిరోజులకే మంత్రి పొన్నం ప్రభాకర్ ‘స్థానికులకే టికెట్’ అంటూ అంజన్ ఆశలపై నీళ్లు చల్లారు. అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్ ఇద్దరూ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవాళ్లు కూడా కాదు. మొదటి నుంచీ కాంగ్రెస్‌నే నమ్ముకొని ఉన్నవాళ్లు.
అయినా ఈ ‘అసలు కాంగ్రెస్’ నేతలకు పార్టీలో ప్రతికూల పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి? ఢిల్లీలోని అధిష్ఠానమే అభ్యర్థిని ఎంపిక చేస్తుందనే కాంగ్రెస్ పార్టీ సంప్రదాయానికి భిన్నంగా ఈ ఇద్దరు నేతలకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ ఎందుకు పావులు కదుపుతున్నది? సీఎం వర్గంలో కీలకంగా వ్యవహరించే మంత్రి పొన్నం ప్రభాకర్ అధిష్ఠానంతో సంబంధం లేకుండా ‘స్థానికులకే టికెట్’ అనే ప్రకటన చేయడం వెనక మర్మమేమిటి? ఇప్పుడు అధికార కాంగ్రెస్‌లో సీనియర్లు మొదలు కార్యకర్తల వరకు జరుగుతున్న ప్రధాన చర్చ ఇది. జూబ్లీహిల్స్లోనే కాదు ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలో, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, గత రెండేండ్లలో పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తే.. ఇది పక్కా ప్రణాళికలో భాగమని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అసలు కాంగ్రెస్ నేతలను పక్కకు తప్పించేందుకు ‘ముఖ్య నేత’ కనుసన్నల్లో పార్టీలో ‘ఆపరేషన్ అసలు కాంగ్రెస్’ నడుస్తున్నదా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు పలు ఉదాహరణలు చూపుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో అసలు వర్సెస్ వలస
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం కాంగ్రెస్‌లో జరుగుతున్న కుమ్ములాట కీలక మలుపు తీసుకున్నది. పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయం, సర్వేల్లో బలమున్న వారికే టికెట్ అంటూ సీఎం సహా పార్టీ కీలక నేతలు తరచూ ప్రకటనలు చేస్తున్నా టికెట్ పందేరంలో మాత్రం అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య పోరు నడుస్తున్నదని సీనియర్ నేతలు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జ్ అజారుద్ద్దీన్ మాజీ క్రికెటర్, మైనార్టీ నేత. మొదటి నుంచీ టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ విధానాల మేరకు ప్రచారానికి ఆయనే నేతృత్వం వహించాల్సి ఉంటుంది. అయితే సీఎం వర్గం మొదటి నుంచీ ఆయనను బైపాస్ చేసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నది. ఇది ఆయనకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనని తేలిపోయింది.
అయితే అజార్‌ను కావాలనే పక్కన పెట్టారనే సంకేతం బయటికొస్తే బద్నాం అవుతామనే భయంతో సీఎం వర్గం ‘ఎమ్మెల్సీ’ అస్ర్తాన్ని ప్రయోగించిందని భావిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నానని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ చాలా రోజుల కిందటే ప్రకటించారు. అనూహ్యంగా ఆయనకు చెక్ పెట్టేందుకు సీఎం వర్గం ‘స్థానిక’ వాదాన్ని తెరపైకి తెచ్చింది. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రకటన చేశారు. ఇలా ఇద్దరు సీనియర్ నేతలను పక్కకు తప్పించేందుకు ఎమ్మెల్సీ అస్త్రం, స్థానిక వాదాన్ని ప్రయోగించడంతో ‘పార్టీలో అసలు ఏం జరుగుతున్నది?’ అనే ఆందోళన మొదలైంది. మరోవైపు సీఎం వర్గం ఎత్తుగడలను గ్రహించి అజార్, అంజన్‌కుమార్‌యాదవ్ అప్రమత్తమయ్యారు. అంజన్‌కుమార్ తనకు అనుకూలంగా నియోజకవర్గంలో పోస్టర్లు, బ్యానర్లు వేయించగా, అజారుద్దీన్ సైతం రేసులోకి రావడంతో సీఎం వర్గం కంగుతిన్నది.
ప్యారాచూట్ నేతలకే ప్రాధాన్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం వర్గం అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టి, వలస నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నదని సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నవీన్‌యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరుల పేర్లను తెరపైకి తెచ్చి పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా నవీన్‌యాదవ్‌కు టికెట్ ఇప్పించేందుకు సీఎం వర్గం శాయశక్తులా పని చేస్తున్నదని, అధిష్ఠానానికి పంపే నివేదికల్లోనూ ఈ తరహా జిమ్మిక్కులు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. స్థానికులకే టికెట్ అనే ప్రతిపాదనను మంత్రి పొన్నం తెరపైకి తీసుకురావడం వెనక ఆంతర్యం ఇదేనని అనుమానిస్తున్నారు. అంజన్‌కుమార్‌యాదవ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోనూ ‘ప్యారాచూట్ నేతలకు సీఎం వర్గం ప్రాధాన్యం ఇవ్వడం వెనక డబ్బులా? ఇంకేమైనా మర్మం ఉన్నదా?’ అనే సందేహం వ్యక్తంచేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలోనూ పార్టీ సీనియర్ నేతల్ని కాదని సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం వలస నేతను తెరపైకి తెచ్చారని గుర్తుచేస్తున్నారు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటికి కొంతకాలం మాత్రమే కావడంతో ఎవరూ ఈ కుట్రను అర్థం చేసుకోలేకపోయారని సీనియర్లు పేర్కొంటున్నారు. సీనియర్లు అయితే ప్రతి విషయానికి నేరుగా అధిష్ఠానం వరకు వెళ్తారని సీఎం, ఆయన వర్గం భయపడుతున్నారన్న చర్చ జరుగుతున్నది. వలస నేతలైతే తాము చెప్పినమాట వింటారన్న భావనలో ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే చిక్కినప్పుడల్లా అసలు కాంగ్రెస్ నేతల రాజకీయ ప్రస్థానాన్ని ఖతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ సీనియర్ నేత విశ్లేషించారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. వనపర్తి నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మేఘారెడ్డిని తీసుకువచ్చారని గుర్తుచేస్తున్నారు. పాలకుర్తిలో సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి ఊసే లేకుండా చేశారని, జగిత్యాలలో సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి, అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్‌ను తెచ్చి పెట్టారని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని ఉదహరిస్తున్నారు. దీనిని బట్టి తాను తెచ్చి పెట్టిన వలస నేతలను బలోపేతం చేసేందుకు రేవంత్, ఆయన వర్గం నిత్యం పావులు కదుపుతూనే ఉన్నారని సీనియర్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.