శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. మరి మీరెవరు? తెలంగాణ తొలి ఉద్యమ ద్రోహి రేవంత్ కాదా? తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని పోయింది రేవంత్ కాదా? అసొంటోడు జంగు సైరన్ ఊదుతడట.. జంగ్ ఎక్కడికి? సైరన్ ఎక్కడికి? కాంగ్రెస్ జంగుపట్టిన తుపాకీ. తుపేల్ నాయకుడు రేవంత్.. జంగ్లేదు బంగ్ లేదు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో చంద్రబాబు పంచన చేరి తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపైకి ఉరికిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు తొలి ద్రోహి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. అవన్నీ మరిచి ఇవాళ శ్రీకాంతాచారి విగ్రహానికి దండేసి సంతాపం ప్రకటిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నల్లగొండ, వికారాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
నల్లగొండకు ఫ్లోరోసిస్ ఇచ్చిందెవరు?
కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్త్తరిలా మారింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏలిన పార్టీ ఇవాళ రెండుమూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉన్నది. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడుకు ఏమిచ్చింది? ఫ్లోరైడ్ సమస్యతో నడుములు వంకరబోయి.. బొక్కలు వంకరబోయి.. మూలుగు సచ్చిపోయి.. మనుషులే సచ్చిపోతరో అన్నంత భయంకరంగా తయారైంది. స్వాతంత్య్రం వచ్చిననాడు మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య లేకుండె. ఉమ్మడి నల్లగొండలో 2 లక్షల మందికి ఫ్లోరోసిస్ ఇచ్చిన పాపం కాంగ్రెస్‌ది కాదా? ఇవాళ సీఎం కేసీఆర్ ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తుంటే ఏడేండ్లలో కేసీఆర్ ఏం చేసిండని మాట్లాడుతున్నరు.
వసూళ్ల కోసమే మీటింగ్‌లు..
రియల్ ఎస్టేట్ వెంచర్ ప్లాటింగ్ చేసేవాడు ముందు పెద్ద కమాన్ కట్టి, నాలుగు రోజులు అక్కడా ఇక్కడా ఏదో హడావుడి చేసి పైసలు సంపాదించుకొంటడు. ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నడు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాకూర్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నాడని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డే చెప్పిండు. ఇప్పుడా పైసలు వసూలు చేయటానికి ఇక్కడో మీటింగ్, అక్కడో మీటింగ్ పెడుతున్నడు. రేపు టికెట్లు అమ్ముకోవాలె. పైసలు వసూలు చేసుకోవాలె అన్నదే రేవంత్ ఆలోచన.
సీఎం కేసీఆర్ త్యాగాల ముందు మీ బతుకెక్కడ?
ఒకాయన టీపీసీసీ, ఇంకొకాయన టీబీజేపీ.. ఇవన్నీ ఎక్కడికెల్లి వచ్చినయి? టీఆర్ఎస్ లేకపోతే.. కేసీఆర్ లేకపోతే ఇవెక్కడివి? ఉమ్మడి ఏపీలో ఒకాయన చంద్రబాబు కాళ్లదగ్గర.. ఇంకొకాయన వెంకయ్యనాయుడు కాళ్ల దగ్గరున్నడో ఇంకెక్కడున్నడో! కేసీఆర్ త్యాగాల ముందు మీరెక్కడ? మీ బతుకు ఎక్కడ? తెలంగాణ ప్రజలు రెండుసార్లు ఎన్నుకున్న సీఎం అనే సంస్కారం కూడా లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. కేసీఆర్ రాష్ర్టాన్ని ఏడేండ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీస్కపోయిండో ఒక్కసారి ఆలోచించాలి? పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఎక్కడైనా ఉన్నయా? ఇవ్వాళ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా దూరం చేసింది కేసీఆర్ కాదా?
అజీర్తి యాత్ర
ఒకాయిన పాదయాత్ర చేస్తడట! పాదయాత్ర కాదది.. తిన్నది అరగక చేసే అజీర్తియాత్ర. ఆయన ప్రతి రోజూ కేసీఆర్ ఇచ్చిన గొర్రెపిల్లను ఎత్తుకొని.. చెరువుల్లో కేసీఆర్ వేసిన చేపలు పట్టుకొని.. కేసీఆర్ ఇచ్చిన కరెంట్‌తోని.. నీళ్లతోని పచ్చని పొలాల మధ్య నడుచుకుంట.. అక్కడక్కడ కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు తాగుకుం టా తిరుగుతడు. దానికి పేరు సంగ్రామయాత్ర. హిందూముస్లిం.. అక్బర్ బాబర్, బిన్‌లాడెన్.. గివే ఆయనకు తెలిసినవి. పచ్చగున్న రాష్ట్రంలో చిచ్చుపెట్టాలనే ఆలోచనే. సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్ల పెట్టిచ్చి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నారని కేంద్ర జలజీవన్ శాఖమంత్రి చెప్పిండు. కేంద్రం, నీతి అయోగ్, ఆర్బీఐ తెలంగాణను కొనియాడుతుంటే వీళ్లకు మనసున పడక.. కావాలని పిల్లల్ని రెచ్చగొడుతున్నరు. రాష్ట్రంలో అశాంతి చెలరేగాలని చూస్తున్నరు.
యువకులు ఆలోచించాలి
యువకుల్లారా ఆలోచించండి. మనం స్పష్టమైన విధానంతో ముం దుకు పోతున్నం. మన పిల్లల కోసం 945 గురుకులాలు పెట్టి, 4.72 లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తున్న విషయం వాస్తవం కాదా? ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకున్న దుస్థితి నుంచి ఇవాళ ‘నేను సర్కారు దవాఖానకే పోత..అక్కడే ప్రసూతి అయితే మేనమామ కేసీఆర్ కిట్ వస్తదని ఆడబిడ్డలు సర్కార్ దవాఖానకు పోతున్నది నిజం కాదా? ఆడబిడ్డ పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఇచ్చే ఏకైక సీఎం కేసీఆర్ కాదా? దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదని ఆర్బీఐ చెప్పటం గర్వం కాదా?
టీఆర్ఎస్లో చేరినవారు…
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరినవారిలో నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, శేఖర్, కొమురెడ్డి యాదయ్య, బొబ్బిలి శ్రీనివాస్‌రెడ్డి, సంకోజు దుర్గమ్మ, బ్రహ్మం సారథ్యంలో వందలమంది ఉన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ నుంచి శివరాములు, అనంతయ్య, పాండురంగారెడ్డి, వెంకటేశం, ఎస్బీ రహీం నాయకత్వంలో పెద్ద ఎత్తున చేరారు.
రాష్ట్రమంతటా దళితబంధు
మునుగోడు ఎమ్మెల్యే అవిస్తే.. ఇవిస్తే రాజీనామా చేస్తా అంటున్నడు.. మీరు రాజీనామా చేయకపోయినా రాష్ట్రమంతటా దళితబంధు ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ది, సీఎం కేసీఆర్‌ది. ఏ గ్రామానికి పోయినా.. అత్యంత పేదరికంలో ఉన్నది ఎవరంటే దళితులనే చెబుతారు. అంటే మిగతా వాళ్లు ధనికులని చెప్పటం లేదు. బీసీల్లోనూ, ఇతర అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నరు. ముందుగా దళితులతో ప్రారంభించి.. ఆ తర్వాత బీసీలకు.. ఆ తర్వాత ఇంకొకరికి అనే పద్ధతిలో సీఎం ఆలోచిస్తున్నరు. దళితబంధును విజయవంతం చేసుకొంటే.. తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారతది. ‘రాష్ట్రం అన్నింటా సర్వతోముఖాభివృద్ధి కావాలె. పేదల ముఖాల్లో సంతోషం రావాలె’ అన్నదే సీఎం తపన.
విపక్షాలవి మాటలు..
టీఆర్ఎస్వి చేతలు:మంత్రి జగదీశ్‌రెడ్డి
ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకునే నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు బూ తులు, వ్యక్తిగత విమర్శలు, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు మె తుకు ఆనంద్, సైదిరెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్, సైదిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి పాల్గొన్నారు.