TG Assembly | రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారు ప్రజా పాలన అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలను అమలు చేస్తున్నది. తెలంగాణ శాసనసభ ఆవరణలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరణపై నిషేధం విధించింది. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సర్కారు ఈ చర్యలకు దిగిందనే పలువురు విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్న మొన్నటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్ లైవ్ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై ఎలాంటి ఆంక్షలు లేవని గుర్తు చేస్తున్నారు. తాజా కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ప్రజా పాలన అంటూ ఎక్కడికక్కడ.. నిర్బంధకాండను అమలు చేస్తున్న సర్కారుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.