హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్ నిర్వాకంతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడనున్నది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు గొడ్డలిపెట్టులా మారింది. ట్రిబ్యునల్ వాదనలన్నీ నీరుగారే ప్రమాదం ఏర్పడింది. ఏపీ సర్కార్‌తో ఒప్పందాలకు అత్యుత్సాహంతో ఉరుకలేస్తున్న రేవంత్ సర్కార్.. కేవలం గురుదక్షిణ కోసమే పాలమూరును, తెలంగాణ జలహక్కులను పణంగా పెడుతున్నదని స్పష్టమైపోతున్నది. వాస్తవంగా కృష్ణానదీ జలాలను ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగానే పంచాలని నిర్దేశించారు.
దాంతో తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని, న్యాయమైన నీళ్ల వాటా ఆకాంక్ష నెరవేరబోదని, పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటివాటాలు తేల్చాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ఏర్పాటు అనంతరమే తొలి సీఎం కేసీఆర్ కేంద్రం ముందుపెట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 45 రోజుల్లోనే సీఎం హోదాలో కేసీఆర్ కేంద్రం సర్కార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లో సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి న్యాయమైన నీటి వాటా తేల్చాలని వినతిపత్రం అందజేశారు. దాదాపు పదేండ్లపాటు కేంద్రంపై పోరాడి, ఒత్తిడి తెచ్చి ట్రిబ్యునల్‌ను సాధించారు. తుదకు 2023 సెప్టెంబర్‌లో సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్యనే కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కృష్ణా జలవివాద ట్రిబ్యునల్-2కు నూతన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్)ను కేంద్ర ప్రభుత్వం జారీచేసింది.
ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్-1, ట్రిబ్యునల్-2 కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు మొత్తంగా 1,050 టీఎంసీల్లో 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లో నివసించే జనాభా, దుర్భిక్ష ప్రాంతాల ప్రామాణికంగా తెలంగాణకు 789 టీఎంసీల వాటా దక్కుతుందని ప్రతిపాదనలతో కూడిన డిమాండ్లను తెలంగాణ ఇప్పటికే ట్రిబ్యునల్ ముందుపెట్టింది. అందులో ప్రస్తుతమున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 300 టీఎంసీలైనా దక్కుతాయని నీటిరంగ నిపుణులు అంచనా వేశారు. అప్పుడు పాలమూరుకు 90 టీఎంసీలు, డిండికి 30 టీఎంసీలే కాదు నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర కృష్ణా బేసిన్‌లోని వరద ఆధారిత ప్రాజెక్టులన్నింటికీ నికర జలాలను కేటాయించుకోవచ్చు. స్వతహాగానే అనుమతులు సాధించవచ్చు. ప్రస్తు తం ఏపీ వాదనలు సైతం ముగియగా, కౌంటర్ వాదనలు కొనసాగుతున్నాయి. కానీ, ఇప్పటికే నిర్మాణం పూర్తయి, వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుకు కొత్తగా మళ్లీ అనుమతులు సాధిస్తామంటూ రేవంత్ సర్కార్ హడావుడి చేస్తూ, ఏపీతో ఒప్పందాలకు సిద్ధమవడం గమనార్హం. తద్వారా ట్రిబ్యునల్ వాదనలన్నీ వీగి, తెలంగాణ జలహక్కులకు తీరని విఘాతం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది.
తెలంగాణకు నిబంధనల సాకుచూపుతున్న కేంద్రం.. ఏపీ కోసం నిబంధనలనే తుంగలో తొక్కుతున్నది. కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచీ ఫిర్యాదులు చేస్తున్నా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు తర్వాతే పరిష్కారం లభిస్తుందని దాటవేస్తూ వచ్చింది. ఇటీవల సైతం న్యాయ వివాదాలను సాకుగా చూపుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని, ఇప్పటికే తిప్పిపంపామని రాజ్యసభ వేదికగా కేంద్రం పదేపదే తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ వాదనలకు విఘాతమని కరాకండిగా తిరిస్కరించింది. కానీ ఏపీలోని చంద్రబాబు సర్కార్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల మంజూరుకు అలాంటి నిబంధనలన్నీ తుంగలో తొక్కుతున్నది. కేంద్రమే స్వయంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరుపుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లలో కలవరం మొదలైంది. పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ నీటిహక్కులపై ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రకటనలు చేస్తుండటంపైనా విస్మయం వ్యక్తమవుతున్నది. మాటమాత్రమైనా తమను సంప్రదించకుండా, ఆ వివరాలేవీ చెప్పకుండా కీలకమైన, అత్యంత సున్నితమైన అంశాలపై రాజకీయపర నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా.. బనకచర్లపై సర్కార్ చర్చలకు పరుగులు పెట్టడం నాటి నుంచీ, పాలమూరు వాటా కుదింపు వరకు, అంతర్రాష్ట్ర అధికారుల్లేకుండానే కమిటీని ఏర్పాటు చేయడం, ప్రస్తుతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీ ముందుకు తెస్తున్న పోలవరం-నల్లమలసాగర్ లింకు నిర్మాణంపై నిర్ణయాలు తీసుకోవడం వరకు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.