రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. ఒకవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండే రుణాలను పూర్తిగా తీసుకోవడంతోపాటు మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి భారీఎత్తున రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నది.
తాజాగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా విలువైన భూములను తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్లను సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా పెద్ద ఎత్తున రుణ సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రుణాలు ఇప్పించే బ్రోకరేజీ సంస్థలను కూడా సంప్రదిస్తున్నది.
టీజీఐఐసీ ద్వారా బుద్వేల్తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే, అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ సర్కారుకు ఆ రుణాలు సరిపోవు. దీంతో ప్రత్యామ్నాయాల అన్వేషణ చేపట్టింది.
IMG Lands | హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఐఎంజీ భారత్కు కేటాయించిన భూములను గత ప్రభుత్వాలు న్యాయపోరాటం చేసి రక్షించాయి. ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో బలంగా వాదించి ఆ భూములు తెలంగాణ ప్రజలకు దక్కేలా చేసింది. న్యాయస్థానాల్లో 21 ఏండ్లుగా ఉన్న కేసుల పీటముడి తెగడంతో ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చాయి. ఇందులో 450 ఎకరాల భూమి టీజీఐఐసీ పరిధిలో, మరో 400 ఎకరాలు రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న రేవంత్రెడ్డి సర్కారు కన్ను ఇప్పుడు ఈ భూములపై పడింది.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లి, రావిర్యాలలో 450 ఎకరాల భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చింది. ఇందులో టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న 450 ఎకరాల భూమిని కూడా తాకట్టు పెట్టి అక్షరాలా రూ.20 వేల కోట్లను సమీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బాండ్ల రూపంలో రుణాలు సమీకరించేందుకు రంగం సిద్ధంచేసింది. ఇంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా తీసుకునే పక్షంలో ఎఫ్ఆర్బీఎం వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. అందుకే, ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఇన్వెస్టర్లను, ప్రైవేటు బ్యాంకులను సంప్రదిస్తున్నది. 20-30 ఏండ్ల కాలానికి రుణాలను తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ సొమ్ము వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో కొన్నింటిని నెరవేర్చవచ్చన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. అయితే, ఒక సంవత్సరంపాటు మాత్రమే ఆయా హామీలను నెరవేర్చేందుకు ఈ భూములు ఉపయోగపడతాయని, ఆ తరువాత పరిస్థితేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
ఐఎంజీ భారత్ నుంచి స్వాధీనం చేసుకున్న మరో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. గచ్చిబౌలిలో ఉన్న ఈ స్థలాలు అత్యంత విలువైనవి. ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం రూ.70 కోట్ల నుంచి 80 కోట్లు పలుకుతుందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. వీటిలో ఇంకా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. వీటిని తొలగించే బాధ్యతను ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అప్పగించింది. వీటిని కూడా వేలం వేస్తే కనీసం రూ.30 వేల కోట్లకుపైగా వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఒక్క ఐఎంజీ భూముల ద్వారానే ప్రభుత్వానికి కనీసం రూ.50 వేల కోట్లు సమకూరే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ఎస్టేట్ పుంజుకోకపోవడంతో ఈ భూములకు సంబంధించిన ఆక్రమణలను పూర్తిగా తొలగించి స్వాధీనం చేసుకున్న తర్వాత వీటిని కూడా అమ్మివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. రానున్న ఏడాదిలోపే హైదరాబాద్లోని అత్యంత విలువైన రూ.50 వేల కోట్ల విలువైన భూములను తాకట్టుపెట్టి గానీ, అమ్మిగానీ ప్రభుత్వ ఖజానాను నింపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఐఎంజీ భూములన్నింటినీ అమ్మి రూ.50 వేల కోట్లను సమీకరించుకుంటే.. ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక రాష్ట్రం వరకు ఎన్నడూలేని విధంగా భూముల ద్వారా అత్యధిక సొమ్మును సమీకరించుకున్నట్టవుతుంది.