హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నదని పరిశ్రమల శాఖలో చర్చ జరుగుతున్నది. మంత్రివర్గ ఉపసంఘం ప్రమేయం లేకుండానే నేరుగా క్యాబినెట్లోకి వచ్చిన సిఫారసులను చట్టవిరుద్ధంగా ఆమోదింపచేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు దీనికి సబ్‌కమిటీ ముసుగు తొడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలికి వేగవంతంగా తరలించాలనే ప్రతిపాదన, పారిశ్రామిక భూములను మల్టీయూజ్ జోన్స్‌గా మార్చాలన్న అంశాలను ఇప్పటివరకు ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్‌లో చేర్చనే లేదని, ఏడాది కాలంలో ఇటువంటి ప్రతిపాదనలు కమిటీ ముందుకు రానేలేదని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు.
నిజానికి భట్టి నేతృత్వంలో ఏర్పాటైంది ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ. కాలుష్య కారక పరిశ్రమల తరలింపుతో దీనికి సంబంధం లేదు. కమిటీ టర్మ్స్ అండ్ రెఫరెన్స్‌లో కూడా ఆ ప్రస్తావన లేదు. అయినప్పటికీ ఆ సబ్‌కమిటీ సిఫారసులతోనే హిల్ట్ పాలసీని రూపొందించినట్టు కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) రహస్యంగా రూపొందించిన సిఫారసులనే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టారని, ఈ ప్రతిపాదనలపై మంత్రులకు కనీస అవగాహన కూడా లేదని వారు చెప్తున్నారు. ప్రాధాన్యం లేని చివరి అంశంగా దీనిని క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెట్టి గుట్టుగా పని కానిచ్చారని అంటున్నారు. అప్పటికీ దక్షిణ తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరం వెలిబుచ్చినా పట్టించుకోలేదని తెలిసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని బయటపెట్టడంతో.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతి బురదను మంత్రులందరికీ పూయటానికే మంత్రివర్గ ఉపసంఘం ముసుగు తొడుగుతున్నారని పరిశ్రమలశాఖలో చర్చ జరుగుతున్నది.
థర్డ్ పార్టీగా ముఖ్యమంత్రి సోదరులు!
సుమారు ఏడాదిన్నరపాటు సీఎం, ఆయన సోదరుల కోసం ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల, దానికి సమీపంలోఉన్న ప్రభుత్వ, పారిశ్రామిక, అసైన్డ్, వివాదాస్పద భూముల వివరాలు తెప్పించి, భారీ మొత్తంలో భూ బ్యాంకును రూపొందించినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి సోదరులు థర్డ్ పార్టీగా ఉండి, పారిశ్రామికవర్గాలతో రహస్యంగా కొనుగోలు ఒప్పందాలు చేసుకొని వారిచేత భూములు కొనుగోలు చేయించినట్టు సమాచారం. ఉప్పల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్న భూములు దాదాపుగా సీఎం సోదరుల చేతికి వచ్చాయని, ఇక్కడ భారీ ఎత్తున హైరైజ్ భవనాలు కట్టడానికి ప్రణాళికలు రూపొందించారని ప్రచారం జరుగుతున్నది.
భవన నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కూడా జరిగినట్టు సమాచారం. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ భూముల కుంభకోణంగా తెరమీదకు వస్తుందని ముందే పసిగట్టిన అప్పటి ఈ శాఖ అత్యున్నత అధికారి తెలివిగా టీజీఐఐసీ వైపునకు తిప్పినట్టు తెలిసింది. అంతిమంగా రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం, 50 శాతం పేరిట రెండు శ్లాబుల ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. మంత్రులకు పారిశ్రామిక భూములు, ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద కనీస పరిజ్ఞానం లేకపోవటం వల్లనే మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మల్టీయూజ్ అనే పదాన్ని, పదేపదే మల్టీజోన్ అని పలికారని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు.
ఉన్నది ఉన్నట్టే జీవోలో చెప్పి..
ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.27లో టీజీఐఐసీ వీసీ, ఎండీ చేసిన ప్రతిపాదన ఆధారంగానే హిల్ట్ పాలసీ అమల్లోకి తెస్తున్నట్టు పేర్కొన్నది. ఉత్తర్వులకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన డ్రాఫ్ట్ కాపీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాలుష్య నియంత్రణ బోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు కానీ, ఇప్పటివరకు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదకరమైన లోహాలు, రసాయనాలు ఉన్నట్టు పరిశోధన చేసి నిర్ధారించినట్టు గానీ పేర్కొనలేదు. గతంలో ఉప్పల్, కాటేదాన్ భూముల్లో ప్రమాదకరమైన పాదరసం, సీసం అవశేషాలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించాయి.
ఇవి గర్భస్థ శిశువు మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని తేలింది. ఇప్పుడు ఆ భూముల్లో మూలకాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వాటిని నివాస యోగ్యమైన భూములుగా నిర్ధారించారా? అనేది తేల్చకుండానే టీజీఐఐసీ ప్రతిపాదన మేరకే హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామిక భూములను మల్టీయూజ్ భూములుగా మార్చటం వెనుక ఇంత తతంగం ఉంటుందని మంత్రులకు కూడా తెలియదు. కనీసం ఉపసంఘం సిఫారసుల మేరకే నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడా ప్రస్తావన కూడా ఆ ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్హం.
ఇప్పుడేమో ఉప సంఘం ముసుగు
చట్టవిరుద్ధంగా హిల్ట్ పాలసీ అమల్లోకి తెచ్చారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు గుర్తించి, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో రేవంత్‌రెడ్డి మంత్రులను మీడియా ముందుకు పంపారనే ప్రచారం జరుగుతున్నది. ఆదాయ వనరుల పెంపు క్యాబినెట్ సబ్‌కమిటీలో ఏడాదిన్నరపాటు చర్చించామని.. దీనిగురించి భాగస్వామ్య పక్షాలతో చర్చించడంతోపాటు నిపుణులతో మాట్లాడి అన్నీ తెలుసుకున్నాకే హిల్ట్ విధానం తీసుకొచ్చినట్టు ఉపసంఘం సభ్యులైన భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, జూపల్లి చెప్పారు. పారిశ్రామికవర్గాలు ఇంకా తకువ ధరకు కావాలని అడిగాయని, ఉచితంగానే భూముల మార్పిడి చేయాలని ఒత్తిడి తెచ్చాయని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖజానాకు డబ్బులు కావాలనే ఆలోచనతో తాము రెండు శ్లాబుల్లో ఫీజులు నిర్ధారించామని వివరించారు.
అదే నిజమైతే ఉత్తర్వుల్లో సబ్‌కమిటీ సిఫారసుల మేరకే అని ఎందుకు ప్రస్తావించ లేదని పరిశ్రమల శాఖ అధికారులు అడుగుతున్నారు. పరిశ్రమలు తరలించటం ఉపసంఘం పరిధి కాదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. ఒకవైపు భూములకు ఉన్న రిజిస్ట్రేషన్ విలువ తగ్గించటం అంటేనే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పెడుతున్నట్టు అర్థం అని, ఆదాయ వనరుల కుదింపు అధికారం ఉపసంఘానికి లేదని, ఒకవేళ సబ్ కమిటీ అటువంటి నిర్ణయం తీసుకుంటే అది చట్టవిరుద్ధం అని సదరు అధికారి తెలిపారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వటం చెల్లుబాటు కాదని ఆయన చెప్పారు.
కేటీఆర్ ప్రెస్‌మీట్.. టీవీల వద్దే పరిశ్రమలశాఖ ఉద్యోగులు
పారిశ్రామిక భూముల బదలాయింపు అంశం డ్రాఫ్ట్ కాపీ రూపొందిస్తున్నప్పుడే ఇది అతిపెద్ద స్కాం అవుతుందని సచివాలయ వర్గాల్లో చర్చ జరిగినట్టు తెలిసింది. ఇదే అంశాన్ని పరిశ్రమలశాఖ ఎస్వోలు కొందరు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. తమ వద్దకు ఫైల్ వచ్చినప్పుడే అందులోని లోపాల మీద వ్యాఖ్యానించినట్టు సమాచారం. పాలసీలో కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం పెట్టినప్పుడు పరిశ్రమలశాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు టీవీల దగ్గర అతుక్కుపోయి చూసినట్టు సమాచారం.