Rythu Bharosa | కొల్లాపూర్, ఫిబ్రవరి 15: మూలిగే నక్కపై తాటికాయపడినట్లు సరిగ్గా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కోసరు మింగడంతోపాటు రైతుల సర్వే నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. తద్వారా అన్నదాతకు పెట్టుబడిగా అందించే రైతు భరోసాకు అసలుకే ఎసరు పెట్టింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం అందించిన డిజిటల్ పాస్ బుక్ రికార్డులలో 7,45,684.1 ఎకరాల భూమి నమోదైంది. ఇంకా వివిధ కారణాలతో రికార్డులకు ఎక్కని వేల ఎకరాల భూమి సాగులో ఉంది. రైతు భరోసా ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. సర్వే ఆధారంగా గుర్తించి రెవెన్యూ అధికారులు 7,771.91 ఎకరాల భూమిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. కానీ అనధికారికంగా జిల్లాలో రైతు భరోసా పథకం అమలుకు వేల ఎకరాల భూమి బ్లాక్ లిస్టులోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.
మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం కొసరుకు ఎసరు పెట్టింది. కొంతమంది రైతులకు రికార్డుల్లో మూడెకరాలకు రైతు భరోసా పడినట్లు మెసేజ్ వస్తోంది. కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు మాత్రం జమ కావడం లేదు. కోడేరు మండలం నరసాయిపల్లి గ్రామ రైతు రమేష్‌కు 2.25 ఎకరాల భూమి ఉంది. కానీ2.16 ఎకరాల భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. మిగతా తొమ్మిది గుంటల సాగుభూమికి రైతు భరోసా క్రెడిట్ కాలేదు.
కొల్లాపూర్ మండల పరిధిలోని మరో రైతుకు 2.10 ఎకరాలభూమి ఉంది. కానీ రెండు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం జరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.6,000 ఇస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం ఎకరాకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెల్లించిన డబ్బులు మాత్రమే ఇస్తుందని అంటున్నారు. కొంతమంది రైతులకు కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కంటే తక్కువగా ఇస్తుందని రైతులు వాపోతున్నారు.
రుణమాఫీ మాయజాలం నుంచి రైతులు పూర్తిగా తేరుకోక ముందే రైతు భరోసా కోసరుతో రైతుల ఉసురు తీసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మళ్లీ రైతు పట్టా భూముల సర్వే నంబర్లకు ఎసరు పెట్టినట్లు తెలుస్తున్నది. రైతు భరోసా డబ్బులు ఒకే సర్వే నెంబర్ ఉన్నవారికి పడితే, ఒకటి కంటే ఎక్కువ సర్వే నెంబర్లలో ఉన్న అర్థ గుంట, రెండు గుంటలు ఉన్న భూమికి డబ్బులు క్రెడిట్ కాలేదని తెలుస్తున్నది. సర్వే నంబర్లకు రైతు భరోసా డబ్బులు పడకపోతే ఆ సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో ఉన్నట్లా అనే విషయం తెలియాల్సి ఉంది. రైతు భరోసా డబ్బులు క్రెడిట్ కాని సర్వే నంబర్లలోని భూమిని కయవిక్రయాలకు అవకాశం ఉంటుందో, లేదోననే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. భూమి అనేది రైతులకు ఆత్మగౌరవం, ఆత్మగౌరవాన్ని కుదించి రైతుల ఉనికిని ప్రశ్నార్ధకం చేయొద్దని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బ్లాక్ లిస్టులోకి వెళ్లిన సర్వే నెంబర్లపై రైతు భరోసా క్రెడిట్ చేసే విషయమై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
‘2.25 ఎకరాలసాగు భూమి ఉంది. కేసీఆర్ రైతు బంధు డబ్బులు సాగుభూమి మొత్తానికి వచ్చేవి. కానీ ఇప్పుడు పెరిగిన డబ్బుల సంగతి అటు ఉంచితే 2.16 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వేశారు. మిగిలిన భూమికి ఎందుకు రైతు భరోసా డబ్బులు వేయలేదు’ అని ప్రశ్నించారు.