CM Revanth Reddy | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కట్టు కథ కంచికి చేరింది. అనుమానాలు పటాపంచలు అయ్యాయి. లోగుట్టు రట్టయ్యింది. తమ్ముడి కంపెనీ పెట్టుబడుల కోసం అన్న చేసుకొన్న అగ్రిమెంట్ బాగోతం బయటపడింది. తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయల్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు న్యూయార్క్‌లో రేవంత్ బృందం ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీతో సోమవారం ఒప్పందం చేసుకొన్నది. అయితే రేవంత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నది ‘స్వచ్ఛ్ బయో’తో కాదు.. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’తో అని ఎట్టకేలకు రుజువైంది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు రేవంత్ తమ్ముడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి. వాటాదారు రేవంత్‌కు సన్నిహితుడు హర్ష పసునూరి.
అసలేం జరిగింది?
తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో బయో ఫ్యూయె ల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీ ముందుకొచ్చిందని, దీనికి సంబంధించి న్యూయార్క్‌లో ఒప్పందం కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ‘స్వచ్ఛ్ బయో’ కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంవోయూ కుదుర్చుకున్న ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే, ‘స్వచ్ఛ్ బయో’ కంపెనీతో రేవంత్ సర్కారు చేసుకొన్న ఒప్పందంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. సీఎంవో పేర్కొన్నట్టు ‘స్వచ్ఛ్ బయో’ అనే కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ గానీ, సోషల్ మీడియా ఖాతాగానీ ఏదీ లేదు. ఈ కంపెనీ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎటువంటి సంస్థ నమోదు కాలేదు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మం త్రిత్వశాఖలో, కంపెనీస్ చెక్ వెబ్సైట్లో కూడా దీని వివరాలు లభించలేదు. ఇంకోవైపు.. సీఎంవో విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ్ బయో చైర్మన్‌గా ప్రవీణ్ పరిపాటి అని పేర్కొనగా.. అసలు ఆయన పేరుతో ఆ కంపెనీ లేకపోవటంతో అనుమానాలు పెరిగాయి.
మరి ఏ కంపెనీతో ఒప్పందం??
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. న్యూయార్క్‌లో రేవంత్ బృందం ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు అర్థమవుతున్నది. ఈ కంపెనీని 2024 జూలై 21న హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వైబ్సైట్లో ఉన్నది. ఈ కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి, వేదపల్లి శివానందరెడ్డి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. మరికొందరికి వాటాలు ఉన్నాయి. కంపెనీ షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా చూపించారు. సీఎంవో ప్రకటన ప్రకారం.. ‘స్వచ్ఛ్ బయో’ కంపెనీ చైర్మన్‌గా పేర్కొన్న ‘ప్రవీణ్ పరిపాటి’ నిజానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఆయన ‘సుజెయింట్’ అనే బయోటెక్నాలజీ కంపెనీలో వాటాదారు. అలాగే సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీకి ప్రెసిడెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’కు చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్న సమాచారం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ కంపెనీకి ఆయన చైర్మన్ కాదన్న విషయం అర్థమవుతున్నది.
డీల్‌పై అనుమానాలు మొదలు
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వైబ్‌సైట్ ప్రకారం.. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’ కేవలం 17 రోజుల కిందట ప్రారంభమైన కంపెనీ. దానిలో ఉద్యోగులు మొత్తం పది మంది కూడా లేరని తెలుస్తున్నది. కంపెనీ షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలు. అలాంటి కంపెనీ తెలంగాణలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదన్న సందేహాలు ఇప్పుడు సర్వత్రా పెరుగుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం కార్యాలయం స్పందించకపోవటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీగా రిజిస్టర్ కాకముందే అవుట్సోర్సింగ్ కార్యకలాపాల కోసం అంతర్జాతీయ భాగస్వామిగా సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొన్నది.
ఫొటో చెప్పిన నిజాలు ఇవీ..
న్యూయార్క్‌లో సీఎం రేవంత్ బృందం ‘స్వచ్ఛ్ బయో’ ప్రతినిధులతో చేసుకొన్న ఒప్పందానికి సంబంధించిన ఫొటోను సీఎంవో విడుదల చేసింది. ఆ ఫొటోలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సుగనిత్ కంపెనీ ప్రెసిడెంట్ ప్రవీణ్ పరిపాటితో పాటు హర్ష పసునూరి కూడా ఉన్నారు. సీఎం నుంచి పత్రాలు అందుకొన్నది హర్ష పసునూరి. ఆయన.. రేవంత్‌కు, ఆయన సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’ వాటాదారుల్లో ఒకరు. అందుకే, ఆయన ఈ ఫొటోలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీన్నిబట్టి రేవంత్ ప్రభుత్వం తన తమ్ముడికి చెందిన కంపెనీ ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’తో డీల్ చేసుకొన్నట్టు రుజువైంది. జగదీశ్వర్‌రెడ్డికి ప్రతినిధిగా హర్ష పసునూరి ఈ ఒప్పందానికి హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ‘స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్’కు మరో డైరెక్టర్ అయిన వేదపల్లి శివానందరెడ్డికి యూపీలో వైన్‌షాపులు, బార్లు ఉన్నట్టు సమాచారం. వివాదాస్పదమైన సోమ్ డిస్టిలరీస్ కంపెనీలో గతంలో ఆయనకు వాటాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఆ తర్వాత ఆయన తన వాటాలను వెనక్కి తీసుకొన్నట్టు సమాచారం.
ఎందుకీ డ్రామా?
రాష్ర్టానికి పెట్టుబడులు రావటం లేదన్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల కోసం అమెరికా పర్యటన కూడా చేపట్టింది. అయితే, పర్యటనలో పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదరకపోవటంతో రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో 17 రోజుల కిందట ఏర్పాటు చేసిన తన తమ్ముడి కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి, పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పుకోవడానికే ఈ డీల్ చేసుకొన్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీ పేరును అసంపూర్ణంగా పేర్కొనటం, వేరే కంపెనీ ప్రెసిడెంట్‌ను ఈ కంపెనీకి చైర్మన్‌గా వెల్లడించడం.. అసలు వాస్తవాలను పక్కదారి పట్టించడానికేనని అర్థమవుతున్నది.
మీటింగ్‌లపై అపోహలు వద్దు: జయేశ్ రంజన్
తెలంగాణ అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో అమెరికా పర్యటన సజావుగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, మీటింగ్‌లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, అయితే, అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దని తెలిపారు. పూర్తిగా పరిశీలించకుండా, సమీక్షించకుండా ఏ మీటింగ్‌ను కూడా నిర్వహించటం లేదని వివరించారు. రాష్ర్టానికి ఉపయోగపడుతుందని భావిస్తేనే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గత పదేండ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్‌తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్న అనుభవం తనది అని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వృత్తిపట్ల నిబద్ధత కలిగిన అధికారిగా తాను తెలంగాణ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.
స్వచ్ఛ్‌బయో సంస్థ వాటాదారు హర్ష పసునూరి, ప్రవీణ్ పరిపాటితో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి (పైన) రేవంత్ సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి