Age Relaxation | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. గరిష్ఠ వయోపరిమితిని రెండేండ్లకు పెంచినా అది కొందరికే పరిమితం చేసింది. డీఎస్పీ వంటి యూనిఫాం పోస్టులకు సడలింపు లేకపోవడంతో గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దూరం కానున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏండ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో అభ్యర్థుల వినతులను దృష్టిలో పెట్టుకొని యూనిఫామేతర పోస్టుల గరిష్ఠ వయసును గత కేసీఆర్ సర్కారు 44 ఏండ్లకు పెంచింది. ఇదివరకు 34 ఏండ్లు ఉండగా, ఏకంగా 10 ఏండ్లు సడలించింది. యూనిఫాం పోస్టులకూ మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఫలితంగా గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. వివిధ కారణాలతో రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రద్దయింది. కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కారు ఇటీవలే రెండేండ్లు వయోపరిమితి సడలింపునిచ్చింది. యూనిఫామేతర పోస్టులకు మాత్రమే దీనిని పరిమితం చేసింది.
రెండేండ్ల నుంచి అభ్యర్థులు వేచిచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు ముందే గ్రూప్-1 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేయాలి. అదనపు పోస్టుల సంఖ్యను 60కి పరిమితం చేయకుండా పెంచాలి. వయో పరిమితి సడలింపును గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి వర్తింపజేయాలి.నాన్ లోకల్ అభ్యర్థులు రాకుండా ఉండేందుకు గ్రూప్-1లో తెలుగును క్వాలిఫై పేపర్‌గా పెట్టాలి.
– ప్రభాకర్ చౌటి, పోటీ పరీక్షల శిక్షకుడు
ఇటీవలే ప్రభుత్వం యూనిఫామేతర పోస్టులకు మాత్రమే వయోపరిమితి పెంచింది. ఇది పూర్తిగా అన్యాయం. డీఎస్పీ, ఎక్సైజ్, జైళ్లశాఖలోని యూనిఫాం పోస్టులకు సైతం వయోపరిమితి సడలింపునివ్వాలి. వయో పరిమితి సడలింపు సహా సకాలంలో పోస్టులు భర్తీ చేయకపోతే ఉద్యమాలకు దిగుతాం.
– గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు