Revanth Reddy | తెలంగాణకు రేవంత్ సర్కార్ చేస్తున్న మరో జలద్రోహమిది. కర్ణాటక నీటి దోపిడీపై కొట్లాడటం వదిలేసి, వారికి తెలంగాణ వాటాలను హక్కుభుక్తం చేస్తున్నది. అధికారంలోకి రాగానే భీమా ఎత్తిపోతల పథకం నికర జలాల్లో కోతపెట్టిన రేవంత్ సర్కార్ .. ఇప్పుడు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌కు ఎసరు పెట్టింది. ఆర్డీఎస్ ఆయకట్టును ప్రశ్నార్థకం చేసేలా తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న రెండు బరాజ్‌లకు ఎన్వోసీ ఇచ్చింది. నిరుడు జూలైలో ఎన్వోసీ జారీ చేయగా, ఇప్పటికీ సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచింది.
హైదరాబాద్, జూన్22 (నమస్తే తెలంగాణ)/అయిజ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భీమా ఎత్తిపోతల పథకం నీళ్లకు కోతపెట్టింది. కొడంగల్‌కు కేటాయించింది. ఇప్పుడు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు ఎసరు పెట్టింది. కొడంగల్ లిఫ్ట్ కోసం కర్ణాటకకు పణంగా పెట్టింది. ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అడ్డుచెప్పబోమంటూ కర్ణాటకకు హామీనిచ్చింది. రేవంత్ సర్కార్ ఇచ్చిన దన్నుతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రపై ఆర్డీఎస్ ఎగువన ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను చేపడుతున్నది. అవి పూర్తయితే ఆర్డీఎస్కు జల ప్రవాహాలు తగ్గిపోయి, ఆయకట్టు ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ దిగువన సాగునీటి అవసరాలకు లిఫ్టులు, తాగునీటి అవసరాల పేరుతో పంప్‌హౌస్‌ల నిర్మాణాలను సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండా చకచకా చేపడుతున్నది.
ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువన 100 మీటర్ల పరిధిలోనే కురిడి డ్రింకింగ్ లిఫ్ట్‌ను దాదాపు రూ.85 కోట్లతో చేపడుతున్నది. తుంగభద్రకు వచ్చే వరదల సమయంలో ఆర్డీఎస్ బ్యాక్‌వాటర్ నుంచి 60 రోజులపాటు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం లక్ష్యం. ఎత్తిపోసే జలాలను నిల్వ చేసేందుకు మాన్వి తాలూకాలోని కప్పగల్, కురిడి గ్రామాల్లో రెండు టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసి ఏడాది క్రితమే పనులు ప్రారంభించి 60% మేరకు పూర్తి చేసింది. ఆర్డీఎస్కు 15 కిలోమీటర్ల ఎగువన చిక్కాలపర్వి గ్రామం వద్ద రూ.397.5 కోట్లతో 2.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రోడ్డు కమ్ బరాజ్ నిర్మాణానికి కర్ణాటక సిద్ధమైంది. ఇక ఆర్డీఎస్ దిగువన రాయచూరు జిల్లాలోని చికమంచాల గ్రామ సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్ ప్రాజెక్టును చేపట్టాలని, మంత్రాలయానికి రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధానించాలని నిర్ణయించింది. ఇక్కడ బరాజ్ నీటినిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు. ఈ బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి జూకూరు డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ స్కీమ్‌ను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. మొత్తంగా రెండు బరాజ్‌ల ద్వారా 7.5 టీఎంసీలు, కురిడి లిఫ్ట్ ద్వారా మరో 2 టీఎంసీలను వినియోగించేందుకు కర్ణాటక సర్కార్ చకచకా పనులు సాగిస్తున్నది.
కురిడి లిఫ్ట్ మినహాయించి కర్ణాటక ప్రతిపాదించిన చిక్కాలమంచి, చిక్కాలపర్వి రోడ్డు కమ్ బరాజ్‌ల నిర్మాణానికి తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్ గుట్టుగా ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీచేసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సాగునీటిని అందించేందుకే ఆర్డీఎస్ను పణంగా పెట్టింది. మక్తల్-నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల సందర్భంగా పొరుగున కర్ణాటక నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉన్నది. అందుకోసం 2025 మే 12న బెంగళూరులో కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు కొనసాగించింది. కొడంగల్ లిఫ్ట్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం షరతులు విధించింది. తుంగభద్రపై తాము చేపట్టిన 2 బరాజ్‌లకు ఎన్వోసీ ఇవ్వాలని అభ్యర్థించింది. ఆ చర్చల అనంతరమే కర్ణాటక ప్రభుత్వం కొడంగల్ లిఫ్ట్‌కు 2025 జూలై 18న ఎన్వోసీ మంజూరు చేసింది. ఆ ఎన్వోసీలోనూ ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వమే స్పష్టంగా తెలియజేసింది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఇప్పటికీ ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. పూర్తిగా గుట్టుగానే వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆర్డీఎస్ ఎగువన, దిగువన కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై ఆయకట్టు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా, ఆందోళనకు దిగుతున్నా సర్కార్ మౌనం వహిస్తున్నది. కర్ణాటకకు ముందస్తుగా అనుమతులిచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు కిక్కురుమనని పరిస్థితి నెలకొన్నది. ఇదే విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం వెల్లడిస్తూ వాపోతున్నారు.
తుంగభద్ర జలాలను పరస్పరం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో 1944లో హైదరాబాద్ స్టేట్, మద్రాస్ ప్రభుత్వాలు ఆర్డీఎస్ ఆనకట్టతోపాటు కర్నూలు-కడప కాలువను నిర్మించాయి. ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. 15.90 టీఎంసీలకుగాను అతికష్టం మీద 5.53 టీఎంసీలు కూడా అందుబాటులో ఉండని దుస్థితి నెలకొన్నది. ఇక రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణతో సగం ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ భూభాగంలో, మరోసగం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోకి వెళ్లింది. ఆనకట్ట నీటినిల్వ సామర్థ్యం, కాలువల సామర్థ్యం తగ్గిపోగా, తెలంగాణ ప్రాంతానికి సాగునీరందని పరిస్థితి నెలకొన్నది. ఇక ఆర్డీఎస్ ఆధునీకరణ చేపట్టాలని 2004లో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయినప్పటికీ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక సర్కార్ ఆ పనులను చేపట్టడం లేదు.
ఈ నేపథ్యంలోనే వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్డీఎస్ చివరి ఆయకట్టులోని 50 వేల ఎకరాలకు నీరందించాలనే సదుద్దేశంతో కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా తుమ్మిళ్ల లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కార్ కర్ణాటక ప్రాజెక్టులకు ఎన్వోసీ ఇవ్వడం మూలంగా ఆటు ఆర్డీఎస్ ఆనకట్టకు, దాని దిగువన ఏర్పాటు చేసిన తుమ్మిళ్ల లిఫ్ట్‌కు నీళ్లు అందని ప్రమాదం ఏర్పడింది. వెరసి రాబోయే రోజుల్లో ఆర్డీఎస్ ఆయకట్టు పూర్తిగా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయే అవకాశమున్నది. అదీగాక తుంగభద్ర నుంచే ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు జలాలు వస్తుంటాయి. ప్రస్తుతం కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు చేపడుతున్న నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్‌కు సైతం వరద రావడం గణనీయంగా తగ్గిపోనున్నది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం వాటిల్లనున్నది. తెలంగాణ సర్కార్ ఇవేవీ ఆలోచించకుండా కర్ణాటకకు ఎన్వోసీ ఇవ్వడమే ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతున్నది.
కొడంగల్ లిఫ్ట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భీమా ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చింది. రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్ కింద ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలకు నీరందించేలా మొత్తంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళికలను రూపొందించారు. మొత్తంగా 20 టీఎంసీలను కేటాయించగా, అందులో తాగునీటి అవసరాలు 1.54 టీఎంసీలు, ట్రాన్స్మిషన్, ఆవిరి నష్టాలు 2.40 టీఎంసీలు. వాటిని మినహాయిస్తే లిఫ్ట్ స్కీమ్ కింద సాగునీటికి నికరంగా కేటాయించినవి 16.94 టీఎంసీలే. ఆ జలాలతోనే 2లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేసి తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా భీమా ప్రాజెక్టు ఉనికికే ప్రశ్నార్థం చేశారు. కేటాయించిన ఆ అత్తెసరు జలాల్లోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ కోత విధించింది. ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు సాగునీరిస్తామని, తద్వారా 7.33 టీఎంసీలు ఆదా అవుతాయని లెక్కలు గట్టింది. ఆ జలాలనే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్‌కు కేటాయించింది. ఇదిలాఉంటే కోత విధించిన జలాలు పోగా రాజీవ్‌భీమా లిఫ్ట్ స్కీమ్ ఆయకట్టుకు కేవలం 9.41 టీఎంసీలు మిగులుతున్నాయి. భీమా స్కీమ్ ఆయకట్టు డ్యూటీ రెట్టింపు చేసి తీరని అన్యాయానికి తలపెట్టింది. ఒక టీఎంసీతో 20వేల ఎకరాలకు ఏ ప్రాతిపదికగా, ఏ విధానం ద్వారా పారిస్తారనే లెక్కలపై ఇరిగేషన్ శాఖ అధికారులే విస్తుపోతున్నారు. సర్కార్ చర్యల వల్ల బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలన్నింటినీ బలహీనపరచే దుస్థితి నెలకొన్నదని ఇరిగేషన్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతిమంగా తెలంగాణ నీటివాటాకు తీరని ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కురిడి లిఫ్ట్ స్కీమ్ పనులను ప్రభుత్వం తక్షణం అడ్డుకోవాలని ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులతో కలిసి వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. లిఫ్ట్‌తో ఆర్డీఎస్ ఆయకట్టుకు తీరని నష్టమని వివరించారు. అదేవిధంగా మల్లమ్మకుంట ప్రాజెక్టు భూసేకరణ పరిహారాన్ని పెంచాలని కోరారు. తరికైతే ఎకరానికి 20 లక్షలు, డ్రై అయితే ఎకరానికి రూ.16 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
-ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి

రాజోలిబండ డైవర్షన్ సీమ్ (ఆర్డీఎస్)కు సంబంధించి కర్ణాటకతో రాజీపడబోమని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సచివాలయంలో సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆర్డీఎస్, తుంగభద్ర డ్యామ్ అంశాలపై చర్చించారు. తెలంగాణ హకుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఆర్డీఎస్లో తెలంగాణ నీటి వాటాపై రాజీ పడబోమని, ఆయకట్టు ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ట్రిబ్యునల్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.