హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్రెడ్డి అన్నదమ్ములు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని సీఎం సొంతూరైనా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట సాయిరెడ్డి సూసైడ్ లెటర్ రాసి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ‘నేను పాంకుంట్ల సాయిరెడ్డి, తండ్రి రంగారెడ్డి, మాజీ సర్పంచ్. మా గ్రామంలో సుమారు 40 ఏండ్ల క్రితం సొంత ఇల్లు నిర్మించుకున్న.. దారి కోసం ఇంటి ముందున్న పాడుబడ్డ బావిబొందను సొంత ఖర్చులతో పూడ్చుకున్న. ఇంటికి పాల బూత్ పక్కనుంచి దారి చేసుకున్నా. కానీ ప్రస్తుత సీఎం ఎనుముల రేవంత్రెడ్డి బ్రదర్స్ నా మీద కక్షగట్టిండ్రు. నా ఇంటి ముందర పశువుల దవాఖాన కట్టిండ్రు. అయినా నేను ఎలాంటి ఆక్షేపణ చేయలేదు. దవాఖాన పక్క నుంచి నా ఇంటికి దారి ఇడువమని కోరిన. నా ఇంటికి దారి ఇడుస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్లు నా మీద పార్టీల నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుకునేందుకు పూనిండ్రు. నేను ఏపార్టీ కాదు. నాది ప్రస్తుతం దేవుని పార్టీ. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు. అందుకే బాధతో చనిపోతున్నా. ‘జై సీతారామ, జై శివపార్వతులు, జై ఆంజనేయ, జై వీరబ్రహ్మం, నా చావు ఈ దేవుండ్లకు అంకితం..’ అని సాయిరెడ్డి తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.