హైదరాబాద్, మార్చి 23, (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వరుస కేసులతో డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొ ణతం దిలీప్ పాస్‌పోర్ట్‌ను వెంటనే తిరిగి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. నిరుడు జూలై 10న అమెరికా నుంచి తిరిగి వచ్చిన కొణతం దిలీప్‌ను శంషాబా ద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్మల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరించి దిలీప్‌కు బెయిల్ మం జూరు చేసింది. పోలీసులు దిలీప్ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్ పోర్ట్‌ను తిరిగివ్వలేదు. కోర్టులో డిపాజిట్ కూడా చేయలేదు.
పాస్‌పోర్ట్ తిరిగివ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పోలీసుల నుంచి స్పందన లేదంటూ రెండు నెలల క్రితం డీజీపీకి దిలీప్ లేఖ రాశారు. అయినా ఫలితం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జూకంటి అనిల్ కుమార్ విచారణ అనంతరం పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న కారణాలను వివరించాలని పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేశారు. దీంతో పోలీసుల వివరణపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఒక కేసులో పాస్ట్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు, ఆ తర్వాత అది నిర్మల్ అదనపు ఎస్పీ వద్ద ఉండిపోయిందని, ఆపై ఇటీవలే కోర్టులో డిపాజిట్ చేయాలని పంపించామని చెప్పారు. ఈ జవాబుపై అసంతృప్తి వ్యక్తంచేసిన న్యాయమూర్తి, చట్టబద్ధత లేకుండా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవడం అధికార దుర్వినియోగమేనని తేల్చిచెప్పారు. దిలీప్ పాస్‌పోర్ట్‌ను తి రిగి అప్పగించాలని తీర్పు వెలువరించారు.