హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఐబొమ్మ పైరసీ మూవీ వైబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు సహకరించలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్, ఐదు రోజుల కస్టడీ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో అడిషనల్ సీపీ శ్రీనివాసులు విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇమ్మడి రవి స్నేహితుడు నిఖిల్‌ను ట్రాప్ చేసి, రవిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ‘హైదరాబాద్ వస్తున్న మామా’ అంటూ నిఖిల్‌కు రవి చేసిన మెయిల్ ఆధారంగా పట్టుకున్నామని వివరించారు. రవి భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశామన్న ప్రచారం అవాస్తవమని తేల్చిచెప్పారు. రవి ఈజీ మనీకి అలవాటుపడి వారానికో దేశం తిరిగేవాడని వివరించారు. లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం తీసుకున్నాడని వెల్లడించారు.