Retirement Benefits | కరీంనగర్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్‌లో దాచుకున్న డబ్బులు.. పదవీ విరమణతో అందే ఆర్థిక ప్రయోజనాలతో ఎన్నెన్నో కలలు కన్న వారి ఆశలు ఆడియాశలుగానే మారుతున్నాయి. బిడ్డ పెళ్లికి, సొంత ఇంటికి, పిల్లల చదువులకు ఢోకాలేదనుకుంటే సమయానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక.. అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. చివరకు గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్ (జీఎల్ఐ) డబ్బులు కూడా అందక అవస్థలు పడుతున్నారు. ఇది వివిధ హోదాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది.
పెడింగ్‌లో డీఏలను చెల్లిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలోనే ప్రకటించింది. ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి, బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామని, కొత్త పీఆర్సీని ఆరునెలల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పింది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానల్లో వైద్యం అందేలా హెల్త్ కార్డు జారీ చేస్తామని పేర్కొన్నది. కానీ, గద్దెనెక్కాక అన్నింటి మాదిరిగానే ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐకాస అక్టోబర్ 22న ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. నవంబర్ 2 నుంచి పోరుబాట పడుతామని హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన సర్కారు, అక్టోబర్ 24న ఉద్యోగ సమస్యలపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఐదు డీఏలు ఇవ్వాల్సిన స్థానంలో ఒక డీఏను మాత్రమే ఇచ్చి దాటవేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
8 నెలలుగా అందని ప్రయోజనాలు
రాష్ట్రం మొత్తం సుమారు మూడున్నర లక్షలకుపైగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పని చేస్తుండగా.. ప్రతి నెలా దాదాపు 700 నుంచి 1100 వరకు రిటైర్ అవుతున్నట్టు ఆయా సంఘాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి ఉద్యోగుల సంపాదిత సెలవులు, గ్రూపు లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాట్యూటీ, జీపీఎఫ్, తదితర రూపేణా రావాల్సిన సొమ్మును పదవీ విరమణ అయిన వారంరోజుల్లోనే అందించాలి. ఉద్యోగుల హోదాలను బట్టి, ఒక్కో ఉద్యోగి పదవీ విరమణ సమయంలో 30 లక్షల నుంచి 70 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు 1026 మంది ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని విశ్రాంత ఉద్యోగులు చెబుతున్నారు. పదవీ విరమణకు 3,4 నెలల ముందుగానే తాము రిటైర్మెంట్ కాబోతున్నట్టు ఏజీ కార్యాలయానికి ప్రతి ఉద్యోగి తన వివరాలను లిఖిత పూర్వకంగా సమర్పిస్తారు. పేపర్ వర్క్ ప్రాసెస్ ప్రకారం జరిగినా.. ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులను మాత్రం పెండింగ్‌లో పెడుతున్నది. పోనీ ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. దీనిపై విశ్రాంత ఉద్యోగులు నిత్యం ట్రెజరీ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయినా ఎప్పుడిస్తారో ఏ అధికారి వద్ద స్పష్టత లేదు. పోనీ ఆలస్యం అయితే ప్రభుత్వం ఏమైనా వడ్డీ కలిపి ఇస్తుందా..? అంటే అదీ లేదు. గట్టిగా అడిగితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సమాధానం చెబుతున్నారని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఎప్పుడూ లేదు
ప్రభుత్వ ఉద్యోగిగా 30 ఏండ్లు దాచుకున్న సొ మ్మును జీవిత చివ రి మజిలీలో కోటి ఆశలతో ప్లాన్ చే సుకుంటాం. కానీ మునుపెన్నడూలేని విషాదకర, విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది. ఉద్యోగులకు అండగా నిలుస్తామని చెప్పి.. ఆర్థిక ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. స్వాతంత్రం తర్వాత పెన్షనర్ల ప్రయోజనాలను వాయిదా వేసిన సందర్భాలు లేవని చెప్పొచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సమష్టిగా ఉద్యమాలు చేపట్టి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలి.
– చందూరి రాజిరెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్టీయూ
ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్నది
ఒక డీఏతో మా ఉద్యోగులు సంతృప్తిగా లేరు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వెంటనే ఇప్పించాలి. పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ప్రభుత్వం రావడానికి ఉద్యోగులు తమ వంతు కృషి చేసిన విషయాన్ని విస్మరించవద్దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వారికి విశ్వాసం సన్నగిల్లుతున్నది.
– దారం శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
గొప్పలు చెప్పారు.. ఆచరణ మరిచారు
ఒక రిటైర్డు ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తల కిందులవుతున్నది. 30 సంవత్సరాల పాటు తాము దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సబబు అని ప్రభత్వం ఆలోచించాలి. ఇది ఒక్కరి ఆవేదన కాదు, ఇప్పటికే రిటైర్మెంట్ అయిన వారితో పాటు కాబోయే వారి పరిస్థితి ఇలాగే ఉంది. నిజానికి 5 సెప్టెంబర్ రోజు ప్రభుత్వ అధినేతలు రిటైర్డ్ బెనిఫిట్స్ అందజేసి సన్మానం చేసి వీడ్కోలు పలుకుతామని గొప్పులు చెప్పారు. కానీ, ఆచరణలో మాత్రం మరిచారు.
– జాలి మహేందర్‌రెడ్డి, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు