మహబూబాబాద్ రూరల్, మే 7 : సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు రూ.82,40,000 పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ టౌన్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏప్రిల్ 11న ఉదయం 8796984559 సెల్ ఫోన్ నుంచి కాల్ రాగా అతడి భార్య లిఫ్ట్ చేసింది. ‘ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, సదరు ఉపాధ్యాయుడి ఆధార్ నంబర్ పైన 17 వేధింపు కేసులు ఉన్నాయని, ముంబైలో మీ ఆధార్ నంబర్‌తో కెనరా బ్యాంకు అకౌంటు ఉందని, ఓ అంతర్జాతీయ నేరగాడు అందులో రూ.75 లక్షలు వేశాడని, ఓ నకిలీ వారెంట్ పేపర్ చూపించి మీపై అరెస్ట్ వారెంట్ ఉంది’ అని బెదిరించాడు.
సీబీఐ అధికారి అని చెప్పి మరో వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎస్బీఐ ఖాతాలో ఉన్న రూ.20 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.19 లక్షలు, ఆయన భార్య యూనియన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.2 లక్షలు, సేవింగ్స్ నుంచి రూ.9 లక్షలు, గోల్డ్ లోన్ తీసుకొని రూ.18 లక్షలు, ఎల్ఐసీ బాండ్లపై లోన్ తీసుకొని రూ.12లక్షలతో పాటు మరో రూ.2.20 లక్షలు సమకూర్చారు. ఏప్రిల్ 15న సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌కు రూ.49 లక్షలు, 18న రూ.22.20 లక్షలు, 22న రూ.11.20 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా పంపించారు. సైబర్ నేరగాళ్లు వాటిని వెరీఫై చేసి లీగల్ ఫండ్స్ అని తేల్చామని దంపతులను నమ్మించారు. త్వరలో మొత్తం 82,40,000 వారి అకౌంట్‌కు తిరిగి వేస్తామని ఈ నెల 2న దంపతులను నమ్మించారు. ఈ నెల 3న వాట్సాప్ కాల్ చేస్తే సమాధానం రాకపోవడంతో బాధితులు మోసపోయినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రందించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.