ములుగు, సెప్టెంబర్ 5(నమస్తేతెలంగాణ) : ‘అక్కా ఓ సీతక్కా.. నీకు నమస్కారం.. కార్మికుడు చనిపోతే రాలేకున్నావా అక్కా.. ఓ సీతక్క నీకు వందనం.. బడుగు బలహీనవర్గాల మనుషులం.. తిండి, తిప్పలు లేక రోడ్లు ఊడ్చి పాయకాన్ల్లు కడిగి సేవ చేసినందుకే ఈ బతుకా..? ఓ అక్కో… ఓ సీతక్క… ఒక్కసారైన వచ్చిపోవా… ఓ అక్క సీతక్క.. నువ్వు వస్తేనే పరిష్కారం, రాకుంటే రోడ్డెక్కుతాం, గీ ప్రజలంతా ఎదురు చూస్తున్నరు అక్క.. ఒక్కసారైన వచ్చిపోవా నా సీతక్క ..’ అని పాట పాడి కార్మికులకు మద్దతుగా నిలిచాడు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి. ఈ వినూత్న నిరసన ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. ములుగులోని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడికి ఐదు నెలల పెండింగ్ వేతనం రాకపోవడంతో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం స్థానిక మున్సిపాలిటీ ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నా చేపట్టారు. 10 గంటల పాటు టెంటు కింద కూర్చొని కలెక్టర్ రావాలని నినదించారు. అయినా రాకపోగా, సీతక్క నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ములుగుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి, జానపద కళాకారుడు యాకయ్య కార్మికుల ఆవేదనను పాట రూపంలో మంత్రి సీతక్కకు విన్నవించేలా పాట కట్టి ఆలపించాడు. యాకయ్య పాట అక్కడికి వచ్చిన ప్రజలను, ధర్నాలో కూర్చున్న కార్మికులను ఆలోచింపజేసింది.