ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 6: ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ అందక మనోవేదనతో ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కూరపాటి పాండురంగయ్య.. నిరుడు జూలైలో ఉద్యోగ విరమణ పొందాడు. తొమ్మిది నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేదు. అప్పటికే అనారోగ్యం బారిన పడిన ఆయన.. తీవ్ర మనోవేదనతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉన్న అతడి భౌతికకాయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వ వైఫల్యమే పాండురంగయ్య మృతికి కారణమని వారు ఆరోపించారు.
మానసిక ఒత్తిడితో..
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయన్న నమ్మకంతో ఖమ్మంలోని తన ఇంటిపైన మరో అంతస్తు నిర్మించాడు. 9 నెలలైనా ప్రభుత్వం తన ఉద్యోగ విరమణ డబ్బులు అందించకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడి అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. చివరికి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.