హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టు అని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు అని చెప్తున్నా, పూర్తయ్యే నాటికి రూ.లక్షా 50 వేల కోట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం లేదని, రాయలసీమలో ఒక్క ఎకరాకూ అదనంగా నీరు అందదని చెప్పారు. రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.