హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్ : ఉద్యోగ విరమణ చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి అందని బెనిఫిట్స్… అనారోగ్యంతో మెరుగైన చికిత్స తీసుకోలేని అవస్థ.. తల్లిదండ్రులకు మంచి వైద్యం అందించలేని దుస్థితి.. పిల్లల పెండ్లిండ్లకు చేతికి అందని డబ్బులు, సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆశలు అడియాశలు… కట్టుకున్న ఇండ్లకు ఈఎంఐలు చెల్లించలేని బాధలు.. అప్పులు తీర్చలేని కష్టాలు. ఇవీ.. రాష్ట్రంలో బెనిఫిట్స్ అందక అరిగోస పడుతున్న రిటైర్డ్ ఉద్యోగుల కన్నీటి గోస. విజ్ఞప్తులు, వినతిపత్రాలు, నినాదాలు, నిరసనలతో ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా… ప్రభుత్వం దమనకాండకు తెరతీసింది. సుదీర్ఘకాలం ప్రభుత్వంలో సేవలు అందించిన ఉద్యోగులు అనే గౌరవం లేకుండా, పెద్దవయసు వాళ్లు, మహిళలు అనే జాలి, కనికరం చూపకుండా, అనారోగ్యంతో ఉన్నవాళ్ల పట్ల మానవీయత కనబర్చకుండా పోలీసుల ద్వారా కర్కషంగా వ్యవహరించింది. కొందరిని ఇంట్లోనే నిర్బంధించగా… మరికొందరిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, రోజంతా స్టేషన్లలో బంధించింది. పోలీసుల ఆంక్షల్లోనూ రిటైర్డ్ ఉద్యోగులు పట్టుదలతో అసెంబ్లీకి దూసుకెళ్లారు. హక్కుల కోసం గొంతెత్తితే కాంగ్రెస్ పాలకులు నియంతృత్వంగా వ్యవహరించడం తగదని రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం కదం తొక్కారు. బకాయిలను విడుదల చేయాలంటూ రోడ్డెక్కారు. సోమవారం చలో అసెంబ్లీ అంటూ బయల్దేరారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి నుంచే నిఘా పెట్టి, హైదరాబాద్ రాకుండా నిలువరించారు. తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలీసులు తీవ్రమైన ఆంక్షలను విధించారు. రాత్రి నుంచే రిటైర్డ్ ఉద్యోగుల ఇండ్ల వద్ద మోహరించారు. పెద్దసంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులను నిర్బంధించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం అంబటి శాంతయ్య, పాతర్లపాడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కంచుమర్తి పుల్లయ్యలను పోలీసులు సోమవారం తెల్లవారుజామున వారి నివాసాల్లో హౌస్ అరెస్ట్ చేశారు. రోజంతా స్టేషన్లల్లోనే బంధించారు. 33 జిల్లాల్లో దాదాపు 3వేల మందిని నిర్బంధించారు. శాంతియుతంగా అసెంబ్లీకి చేరుకుని, వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరితే పోలీసులను ప్రయోగించి అరెస్ట్ చేయించారని, ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కన్వీనర్ చంద్రమౌళి తెలిపారు. ప్రభుత్వ వైఖరి దారుణమని, ఇందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సంఘం నేతలు చంద్రమౌళి, ప్రభాకర్‌రావు, జగదీశ్వరాచారి, సుధాకర్, రవీందర్రావు, కిషన్‌పటేల్ హెచ్చరించారు. అరెస్టులను బీఆర్ఎస్ భుజంగరావు తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంత జీవితం గడపాలని ఎవరైనా భావిస్తారు. ఒత్తిడి లేని జీవనంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ సర్కార్ కారణంగా ప్రశాంతత కాదు కదా… అనారోగ్యాల బారినపడుతున్నారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్లు గుండెలు ఆగిపోయి చనిపోతున్నారు. దిక్కుతోచక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు సరైన చికిత్స తీసుకోలేక చనిపోతున్నారు. ఇలా కాంగ్రెస్ పాలనలో పలు కారణాలతో 42 మంది రిటైర్డ్ ఉద్యోగులు కన్నుమూశారు. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు 13,323 మంది ఉద్యోగులు, 7,177 మంది టీచర్లు రిటైరయ్యారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు అందాల్సి ఉన్నది. హక్కుగా రావాల్సిన బకాయిల గురించి అడిగితే.. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదాలను సర్కార్ అస్సలు పట్టించుకోవడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కానీ… ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వీడటంలేదు.