హనుమకొండ, అక్టోబర్ 8: ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రాణం కోల్పోయాడు. రూ.15.25 లక్షల రిటైర్మెంట్ బకాయిల కోసం రెండేండ్లుగా ఎదురు చూశాడు. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ.. నగదు రహిత వైద్యం అందక చివరికి శ్వాస వదిలాడు. ఈ విషాదకరమైన ఘటన హనుమకొండలో గురువారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, పెన్షనర్ల సంఘం నాయకుల కథనం ప్రకారం.. హనుమకొండలోని వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన కేశబోయిన ప్రభాకర్ (63) మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి 2024 జూన్‌లో ఉద్యోగ విరమణ చేశాడు. ఇతడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
కుమారుడు కొంతకాలం గా మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభాకర్ ఏడాదికాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇప్పటికే రూ.20 లక్షలు ఖర్చు చేశా డు. 15.25 లక్షల రిటైర్మెంట్ బకాయిల కోసం రెండేండ్లుగా ఎదురుచూశాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ సీమ్ ద్వారా నగదు రహిత వైద్యం అందకపోవడంతో కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారంపడింది. ఓ వైపు రిటైర్మెంట్ బకాయిలు రాక, రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో ఎంతో మనోవేదన చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 25 రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆరెపల్లి సమీపంలోని క్యాన్సర్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచాడు. రిటైర్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తూనే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 105 మంది మృతిచెందినట్టు పెన్షనర్స్ అసోసియేషన్ హనుమకొండ ఎస్టీవో జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు తెలిపారు. ప్రభాకర్‌కు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.