EAPCET | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఏదైనా ఫైల్ పంపిస్తే వెంటనే ఆమోదించడమో.. తిరస్కరించడమో చేయాలి. అత్యవసర అంశమైతే చకా చకా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పెండింగ్ పెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇలా ఓ ఫైల్ పెండింగ్‌లో పెట్టడంతో మంగళవారం నుంచి ప్రారంభంకావాల్సిన టీజీ ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1కి వాయిదాపడింది. లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఉదయం నుంచి యత్నించి విసిగిపోయారు. ఎప్‌సెట్‌లో నాన్‌లోకల్ సీట్లపై తేల్చకపోవడం, ఇందుకు సంబంధించిన పైల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించకపోవడంతో దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్‌పడింది.
తొక్కిపెట్టిన సీఎంవో అధికారి
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేండ్లు అమలైన నాన్‌లోకల్ కోటాకు ఈ ఏడాది గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులు విద్యాశాఖకు చేరగా, సంబంధించిన ఫైల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కోసం పంపించారు. ఆ ఫైల్ సీఎంవోకు చేరగా, సీఎంవోలోని కీలక అధికారి తొక్కిపెట్టారు. అయితే మంగళవారం నుంచి ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫైల్‌పై ఆరా తీయగా, సదరు అధికారియే ఫైర్ అయినట్టు తెలిసింది. ‘ముందే చెప్పకూడదా..? ఇప్పుడే ఏం తొందరొచ్చింది.. కొన్ని రోజులు వాయిదావేయండి’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘నాన్ లోకల్ కోటాపై జీవో ప్రకారం నిబంధనలు అమలవుతాయన్న కండిషన్‌తో మంగళవారం నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని కోరగా.. సీఎంకు చెప్పాలి.. ఆమోదం తీసుకోవాలి.. అప్పుడే దరఖాస్తులు స్వీకరించాలి’ అని ఉన్నతాధికారి ఆదేశించగా దరఖాస్తుల స్వీకరణను వాయిదావేశారు.