హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో విద్యుత్తు కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరి తెలిపారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రత్యేక సమావేశానికి జీసీ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ విద్యుత్తు శాఖ స్టోర్లలో మెటీరియల్స్ అందుబాటులో ఉండటం లేదని, క్షేత్రస్థాయిలో పనులు చేసినా ఎల్సీ(లైన్ క్లియరెన్స్)లు ఇవ్వకపోవడంతో వినియోగదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు తామెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేకుండా టెండర్లు ఇచ్చేదని చెప్పారు.
కాంట్రాక్టర్లుగా మారిన వారంతా నిరుద్యోగులే అయినా ప్రోత్సాహించాల్సింది పోయి నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టోర్లలో ఒక సామగ్రి ఉంటే, మరొకటి ఉండటం లేదని తెలిపారు. దీని వల్ల కాంట్రాక్టర్లు సకాలంలో పనులను పూర్తి చేయకపోతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ కాంట్రాక్టర్లు విద్యుత్తు పనులను పూర్తి చేయాలంటే ఎల్సీ(లైన్ క్లియరెన్స్) అతి పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పారు.
చాలా చోట్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నేమాల బెనర్జి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు మహేందర్, ఉపాధ్యక్షుడు ఆర్ ప్రదీప్‌రెడ్డి, జీడిమెట్ల డివిజన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ అశోక్, కాంట్రాక్టర్లు జీ చక్రధర్‌రావు, వీ చిన్న పుల్లారావు, మాణిక్యాలరావు, రవీందర్‌గౌడ్, కనకాచారి, బాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఈశ్వర్రావు, శ్రీకాంత్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.