నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖలీల్‌వాడి: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర పేరిట చేపట్టిన జిల్లాల పర్యటన.. ప్రజలపై దండయాత్రగా సాగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలతో మమేకం కాకుండా, జనం గోడు వినకుండా రోడ్డు మీద సాగే నడకకు.. జనహిత పాదయాత్ర అంటూ పేరెందుకు పెట్టారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోకుండా యాత్రలు చేయడం అర్థహితమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో కాంగ్రెస్ పాలన గురించి ఎవరూ ప్రశ్నించకుండా నిర్బంధం విధించడం అప్రజాస్వామికమని దుయ్యబడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ పాలననే కదా అని ఎద్దేవా చేస్తున్నారు. శనివారం కూడా మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర పోలీసు పదఘట్టనల నడుమనే ఉద్రిక్తంగానే సాగింది. ఆమె పర్యటించే ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ వేకువజామునే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అరెస్టులు, నిర్బంధంతోనే గ్రామాలు మేల్కొన్నాయి.
ఇండ్లల్లోకి చొరబడిన పోలీసులు!
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వేళ.. నిజామాబాద్ జిల్లా ఆంక్షల వలయంలోకి వెళ్లింది. రోజంతా పోలీసులు నిర్బంధాలకు పాల్పడ్డారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ట్ చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బీఆర్ఎస్ కీలక నేతలు, తెలంగాణ ఉద్యమకారుల ఇండ్ల్లలోకి చొరబడి అరెస్టులు చేసి, ఠాణాల్లోకి తీసుకెళ్లి బంధించారు. కాంగ్రెస్ పాదయాత్రను అడ్డుకోవాలని గానీ, నిరసన తెలపాలని గానీ బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదు. అయినప్పటికీ పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కట్టడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తెల్లవారుజాము నుంచి అరెస్టు చేసిన నేతలను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలోనే బంధించారు. పోలీసుల హడావుడితో బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజానీకం భయభ్రాంతులకు గురయ్యారు. పాదయాత్ర చేస్తూ మీనాక్షి నటరాజన్ తమ వద్దకు వస్తే… అమలు కాని హామీల గురించి, ఆరు గ్యారెంటీల గురించి… గోడు వెళ్లబోసుకుందామని తాము ఎదురుచూస్తుంటే.. పోలీసులేమో అరెస్టులతో ఎమర్జెన్సీ వాతావరణం సృష్టించారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదని చెప్పేందుకు.. ప్రశ్నించకుండా విధిస్తున్న నిర్బంధాలే నిదర్శనమని చెప్తున్నారు.
నిర్బంధాలపై కేటీఆర్ ఆరా
కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యతోపాటు ఇతర ఉన్నతాధికారుతో మాట్లడిన ఆయన.. అరెస్టులపై వాకబు చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా సీపీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్రమ అరెస్టులపై హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైనట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మీనాక్షి నాటరాజన్ పాదయాత్ర ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నేతలను స్టేషన్ల నుంచి విడుదల చేశారు.