Musi Beautification | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డు మీద పడేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు బాధ్యతను అంతర్జాతీయంగా మోసపూరిత కంపెనీగా పేరొందిన ‘మెయిన్‌హార్ట్’కు కట్టబెట్టింది. పాకిస్థాన్‌లో వందల కోట్ల మేర ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ కంపెనీకి మూసీ సుందరీకరణ మాస్టర్‌ప్లాన్ తయారీ టెండర్ అప్పగించింది. మూసీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సంబంధించి రూ.166 కోట్ల పనులు కేటాయించింది. ఇకపై మూసీ ప్రాజెక్టు భవిష్యత్తు మొత్తం ఈ కంపెనీ చేతుల్లోనే ఉండనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు మూసీ సుందరీకరణను లక్షన్నర కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమా మాదిరిగా తెరపై రంగుల కలను చూపిస్తున్నది. దాని చాటున వేల కుటుంబాలను బలి తీసుకుంటున్నది. ఇప్పుడు దొంగకు మరో దొంగ తోడైనట్టు.. పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించిన వ్యక్తుల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టింది. లక్షన్నర కోట్ల ప్రాజెక్టును వాళ్ల చేతుల్లో పెట్టింది. మాస్టర్‌ప్లాన్ తయారీకి కన్సల్టెన్సీ బాధ్యతలను మెయిన్‌హార్ట్ కంపెనీకి అప్పగిస్తూ పురపాలక శాఖ ఆధ్వర్యంలోని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఈ నెల 4న నిర్ణయం తీసుకుంది. టెండర్ ఖరారు చేసి నాలుగు రోజులు గడిచినా ఈ జీవో బయటకు విడుదల చేయకుండా గుట్టుగా ఉంచడం విశేషం. జీవో వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరి 5న పురపాలక శాఖ టెండర్లు పిలిచింది. ఆ మరుసటి రోజే మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు నేరుగా సీఎం రేవంత్‌రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టు డిజైన్లను వివరించారు. అదేరోజు కంపెనీ బాగోతాన్ని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ బయటపెట్టారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ కంపెనీతో ఎలా చర్చలు జరుపుతారని, లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ సైతం బయట పెట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనినిబట్టి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మెయిన్హార్ట్కే అప్పగించాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టెండర్ నిబంధనలు కూడా కంపెనీకి అనుకూలంగా రూపొందించారని అంటున్నారు.
‘మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’కు మాస్టర్‌ప్లాన్ రూపొందించే బాధ్యతను మూడు కన్సల్టెన్సీల కన్సార్షియంకు అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌ఐఓఎస్ డిజైన్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములుగా ఉన్నాయి. ఎంఆర్డీసీఎల్ ఎండీ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
అంతర్జాతీయంగా అభియోగాలున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ఇలాంటి కంపెనీకి కట్టబెట్టడం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా.. కంపెనీ బాగోతం తెలిసిపోతుందని అంటున్నారు. నెటిజన్లు, రాజకీయ నాయకులు, మీడియా ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.