హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారమివ్వకుండానే అధికారులు కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇండ్ల కూల్చివేతను సవాల్ చేస్తూ టీ వెంకటనరసమ్మతోపాటు 23 మంది బాధితులు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. భూదాన్ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలంటూ జనవరి 17న భూదాన్ బోర్డు అధీకృత అధికారిగానున్న సీసీఎల్ఏ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. భూదాన్ యజ్ఞ బోర్డు మే 2017లో ఇండ్ల నిర్మాణం కోసం 100 చదరపు గజాల చొప్పున పట్టాలు జారీచేసిందని తెలిపారు. పట్టాలు రావడంతో తాము ఇండ్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
కానీ తాజాగా భూదాన్ భూములను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్నామని అంటూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దానిని సాకుగా చూపి రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులివ్వకుండా గత నెల 24న తమ ఇండ్లను కూల్చివేశారని వాపోయారు. గతంలోనూ ఇండ్ల కూల్చివేతకు ప్రభుత్వం ప్రయత్నించగా హైకోర్టు ఉత్తర్వులతో ఆగిపోయిందని గుర్తుచేశారు. సర్కార్ తీరుతో తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం కూల్చివేసిన ఇండ్ల స్థానంలో తమకు తిరిగి ఇండ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బాధితులు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.