Mahabubabad | గూడూరు, జూన్ 19: తమకు కావాల్సిన బ్రాండ్ల మద్యం అమ్మకుండా ఇతర బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ మద్యం ప్రియులు బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వైన్‌షాపు ముందు ఆందోళన చేశారు. మండల కేంద్రంలో మొత్తం మూడు మద్యం షాపులుండగా ఒక్క షాపులో కూడా తమకు కావాల్సిన బ్రాండ్ మద్యం లభించడం లేదని, యజమానులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమకు కావాల్సిన మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారంటూ షాపులో ఉన్న ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు.
తమకు ఇష్టమైన మద్యం అందిచాల్సిందేనని, ఎక్సైజ్ అధికారులు వచ్చి షాపులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. బెల్ట్‌షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మద్యం ప్రియులు గంటకు పైగా ఆందోళన చేసినప్పటికీ అధికారులు రాకపోవడంతో మూడు మద్యం దుకాణాల షట్టర్స్‌ను వారు మూసివేశారు. షట్టర్స్ మూసి వేసిన కొద్ది సేపటికి పోలీసులు వచ్చి మద్యం ప్రియులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.