హుస్నాబాద్/అక్కన్నపేట/సిద్దిపేట, జూన్ 29: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్ పంపుహౌస్ వద్ద గురువారం ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ట్రయల్న్ చేసి గోదావరి నీటిని రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 420మీటర్ల ఎత్తులో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి పంపుహౌస్‌కు చేరుకున్న ఎమ్మెల్యే ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఒకటో నంబర్ మోటర్‌ను కంప్యూటర్ ద్వారా ఆన్ చేశారు.
డెలివరీ సిస్టర్న్ నుంచి నీరు బయటకు రాగానే నాయకులు, రైతులు హర్షధ్వానాలతో సంతోషాన్ని వెలిబుచ్చారు. ఒక మోటరు ద్వారా సెకనుకు 700 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. రిజర్వాయర్ భూనిర్వాసితులు, స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసుకున్నామని తెలిపారు. కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని 2015లో రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏండ్ల కల.. సాకారమైన వేళ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఏండ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది.ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సీఎం కీసీఆర్ త్వరలోనే గౌరవెల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు. రిజర్వాయర్‌ను 2-3 టీఎంసీల నీటితో నింపనున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును ఇందిరమ్మ ప్లడ్ ఫ్లో కెనాల్ కింద 2008 -09 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రాజెక్టును ప్రారంభించనప్పుడు దీని సామర్థ్యం 1.41 టీఎంసీలు మాత్రమే. 2015లో దాని సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారు. మిడ్‌మానేరు నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి వస్తున్నాయి. తోటపల్లి నుంచి నార్లాపూర్ వరకు 8 కిలోమీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి గొట్లమిట్ట వరకు ఆప్రోచ్ కెనాల్ 3 కిలోమీటర్లు ఉంటుంది.
ఇక్కడి నుంచి సుమారుగా 12 కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా రేగొండ పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు చేరుకుంటాయి. రేగొండ వద్ద ఏర్పాటు చేసిన పంపుల ద్వారా నీటిని గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తి పోస్తారు. 32 మెగావాట్లతో 3 మోటర్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహాబలి మోటర్లు బిగించారు. గౌరవెల్లి కుడి ప్రధాన కాల్వ ద్వారా 90,000 ఎకరాలకు, గౌరవెల్లి ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 16,000 ఎకరాలు, మొత్తం 1,06,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. గండిపల్లి కుడి, ఎడమ కాల్వల ద్వారా 14 వేల ఎకరాలు కలిపి మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
Pp