హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.1000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయాల ద్వారా రూ.1000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం అనుమతినిచ్చింది. 500 కోట్ల విలువైన బాండ్లను 23 ఏండ్ల కాలానికి, మరో 500 కోట్ల విలువైన బాండ్లను 24 ఏండ్ల కాలపరిమితితో తెలంగాణ సర్కారు రుణం పొందింది. గతవారం రూ.1000 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న రాష్ట్రప్రభుత్వం.. తాజాగా మరో రూ.1000 కోట్ల విలువైన బాండ్లు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే.. కేంద్రం మాత్రం దీనికి ఆదిలోనే మోకాలడ్డింది. బడ్జెట్ , అప్పులు తదితర సాకులను చూపుతూ రెండు నెలలపాటు రుణాలు తీసుకోకుండా అడ్డుకున్నది. కేంద్రం కుట్ర వల్ల తెలంగాణ సుమారు రూ.8000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం రూ.16,500 కోట్లకు చేరింది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి రాష్ర్టాభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది. సంక్షేమం, వసతుల కల్పనతోపాటు పెట్టుబడులు ఆకర్షించి యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు ఈ నిధుల సమీకరణతో వీలవుతుంది.