హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల నమోదులో తెలంగాణ అద్భుత పురోగతి సాధించింది. రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ జాతీయ సగటు కంటే చాలా అధికంగా నమోదైనట్టు శనివారం విడుదల చేసిన 2021-22 హ్యాండ్‌బుక్‌లో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. తెలంగాణలో 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని స్థాయిల్లో బాలుర కంటే బాలికల ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ప్రాథమిక స్థాయిలో తెలంగాణ 112.5% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)తో అగ్రభాగాన నిలిచినట్టు పేర్కొన్నది.. తెలంగాణతో పోలిస్తే ఇతర రాష్ర్టాల్లో ఈ శాతం చాలా తక్కువ.
బీహార్‌లో 102.5, ఉత్తరప్రదేశ్‌లో 101.9, ఏపీలో 101.6, తమిళనాడులో 99, ఒడిశాలో 97.9, ఛత్తీస్‌గఢ్‌లో 96.6, గుజరాత్లో 93.1, మధ్యప్రదేశ్‌లో 86.9 శాతంగా నమోదైనట్టు వివరించింది. ప్రాథమికోన్నత విద్యలోనూ తెలంగాణ 106.5% జీఈఆర్‌తో అగ్రగామిగా నిలిచినట్టు పేర్కొన్నది. ఈ విభాగంలోనూ తెలంగాణ కంటే ఏపీ, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, యూపీ తదితర రాష్ర్టాలు చాలా వెనుకబడి ఉన్నట్టు తెలిపింది. ఎలిమెంటరీ విద్యలో సైతం తెలంగాణ 110.2% జీఈఆర్‌తో బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, జార్ఖండ్ కంటే ముందున్నట్టు వెల్లడించింది.