తెలంగాణచౌక్, నవంబర్ 13: దేశ వ్యాప్తంగా బీసీ గణన చేపట్టాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ‘హలో బీసీ చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వచ్చే నెల 13, 14, 15వ తేదీల్లో ‘ఢిల్లీలో బీసీ జంగ్‌సైరన్’ తలపెట్టినట్టు చెప్పారు. 13న జంతర్ మంతర్ వద్ద నిరసనలు, 14న పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. 15న 18 జాతీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బీసీ గణనకు మద్దతు కూడగడుతామని ఆయన పేర్కొన్నారు.