హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులపై ప్రత్యేక రైళ్ల పేరుతో దక్షిణ మధ్య రైల్వే అదనపు చార్జీలను బాదుతున్నది. ఒక్కో టికెట్‌పై దాదాపు 15 నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నది. రైల్వేను లాభాల్లోకి తీసుకెళ్లి, అదనపు రాబడి ఆర్జించాలన్న ఉద్దేశంతో అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నది. పైగా రద్దీ పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నది. అంతేకానీ, సాధారణ రైళ్లను అందబాటులోకి తీసుకురావటం లేదు. ప్రస్తుతం 285 ఎక్స్‌ప్రెస్ రైళ్లను, 102 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చెప్తున్నది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్ల సంఖ్య తగ్గించి, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణ రైళ్ల కంటే ప్రత్యేక రైళ్ల రాకపోకలే ఎక్కువగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలు రిజర్వేషన్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.