(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పురుషుల్లో వంధ్యత్వానికి చెక్‌పెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలల్లో కృత్రిమ వృషణాలను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్‌కు చెందిన బార్-ఇలాన్ యూనివర్సిటీ పరిశోధకులు విజయవంతమయ్యారు. ఎలుకల వృషణాల్లోని కొన్ని కణాలను తీసుకొని అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ వృషణాలు 9 వారాలపాటు మెరుగైన పనితీరును చూపించాయని పరిశోధకులు తెలిపారు. టెస్టోస్టిరాన్ హార్మోన్, శుక్రకణాల ఉత్పత్తి, నిల్వ, విడుదల తదితర చర్యలను ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వృషణాలు పూర్తి చేశాయన్నారు.
ప్రయోగ ఉద్దేశమిదే!
మనుషుల మూల కణాలను సేకరించి వాటి సాయంతో కూడా కృత్రిమ వృషణాలను అభివృద్ధి చేస్తామని పరిశోధకులు తెలిపారు. తద్వారా వంధ్యత్వానికి చెక్ పెట్టేలా తదుపరి తమ ప్రయోగాలు ఉండనున్నట్టు వెల్లడించారు. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం, వాటిలో చురుకైన కదలికలు లేకపోవడంతోనే పురుషుల్లో సంతానానికి అవరోధం ఏర్పడుతున్నట్టు ఇప్పటివరకూ ఫర్టిలిటీ క్లినిక్‌లు చెప్పగలుగుతున్నాయని, అయితే, శుక్రకణాలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? ఆ సమస్యకు పరిష్కారం ఏమిటన్నదే తమ ప్రయోగ ఉద్దేశమని వాళ్లు వివరించారు. ఈ వివరాలు ‘బయోలాజికల్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.