అచ్చంపేట,దోమలపెంట మార్చి 16 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం 23 రోజులుగా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, హైడ్రా, ర్యాట్ మైనర్స్ బృంద సభ్యులతో సహాయక చర్యలు కొనసాగిస్తూ, అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. దోమలపెంటలోని జడ్పీహెచ్ఎస్, యూపీఎస్, స్పోర్ట్స్ క్లబ్, ఈగలపెంటలోని జిమ్ సెంటర్, కళాభారతి, పటేల్ హాల్ తదితర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మార్పులను అధికారులకు సూచించారు.
సహాయ సిబ్బందికి వసతులు కరువు
నాగర్కర్నుల్ జిల్లా, అమ్రాబాద్ మండలంలో దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి గురైన వారిని కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే తదితర శాఖల సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. వారికి ఇక్కడి అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సహాయక బృందల కోసం గ్రామంలో యూపీఎస్, క్లబ్, ఈగలపెంట జెన్క్లోని జిమ్ హాల్, విద్యుత్ కళాభారతి, పటేల్ బిల్డింగ్లో వసతులు ఏర్పాటు చేశారు. ఆహారం, నీరు, మెడికల్ తదితర వసతులు లేక చాలా దయనీయమైన పరిస్థితి ఉందని, జెన్కోలోని విద్యుత్ కళాభారతి స్టేజీ మీద 150 మంది ఉంటున్నారు, జీహెచ్ఎంసీలో రెండు ఇన్స్టంట్ బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. పక్కనే నది ఉన్నా స్నానం చేయడానికి నీళ్లు లేని పరిస్థితి. రాత్రి పడుకోవడానికి సరైన స్థలం లేక విద్యుత్ కళాభారతి స్టేజీ మీద పడుతుకోవాల్సి వస్తుంది.