అచ్చంపేట : దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో (SLBC) ప్రమాద సంఘటన ప్రాంతంలో సహాయకచర్యలు (Rescue operations) కొనసాగుతున్నాయి. టన్నెల్లో గల్లంతైన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్ర విభాగాలకు చెందిన రెస్య్కూ సిబ్బంది 56 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సోరంగంలో చివరిదశకు సహాయక చర్యలు వెళ్లగా మిగిలిన ప్రదేశంలో సహాయక చర్యలకు ప్రమాదకరంగా మారాయి. అక్కడికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో చివరనా 45 మీటర్ల వద్ద డేంజర్ జోన్ ( Danger zone ) అంటూ కంచే ఏర్పాటు చేసి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. డేంజర్ జోన్లో మిగిలిన ఆరుగురి మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. టన్నెల్ లోపల 13.730 కిలోమీటర్ల నుంచి 19.800 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించి లోపలి నుంచి మట్టి, బురద, టీబీయం మీషన్ కటింగ్ పరికరాలను బయటకు తరలించారు. డేంజర్ జోన్ ప్రదేశం నుంచి భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను కన్వేయర్ బెల్టుద్వారా తరలిస్తున్నారు.
ఆ ప్రదేశంలో ఇంకా కొద్దిపాటి బండరాళ్లు, మట్టి, స్టీల్ పరికరాలు ఉండడంతో వాటిని తొలగించారు. లోపలి ఊటనీరు భారీగా వస్తోంది. వస్తున్న నీటిని వస్తున్నట్లుగా భారీ సామర్థ్యంగల మోటర్ల ద్వారా బయటకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. డేంజర్ జోన్ వరకు రెండు, మూడు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేయనున్నారు. డేంజర్ జోన్ ఆవతల పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వ నిర్ణయం బట్టి ఉంటుంది. టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి శనివారం టన్నెల్ లోపలికి సహాయక చర్యలు పరిస్థితి గమనించారు.
24న తదుపరి సహాయక చర్యలపై సమావేశం?
టన్నెల్ లోపల సహాయక చర్యలు తుదిదశకు చేరుకోవడంతో మిగిలిన డేంజర్ జోన్ ప్రదేశంలో సహాయక చర్యలు ప్రారంభించేందుకు ఈ నెల 24న ఉన్నతాధికారులు, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సమావేశం అవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో డేంజర్ ప్రదేశంలో తవ్వకాలు జరుపడమా? లేక బ్లాస్టింగ్ విధానమా? ప్రభుత్వ నిర్ణయం బట్టి తదుపరి సహాయక చర్యలు చేపట్టనున్నారు.
24న టెక్నికల్ కమిటీ, సహాయక చర్యలు కొనసాగిస్తున్న ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశంలో పై నుంచి గుట్టను తొలగించడమా? అనేది అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.