నాగర్‌కర్నూల్, మార్చి 30 : నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎల్ఎల్బీసీ టన్నెల్లో ఉగాది రోజైన ఆదివారం కూడా కార్మికుల కోసం అన్వేషణ కొనసాగింది. ఈ మేరకు టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయక బృందాల శ్రమ నానాటికి గుర్తిండి పోతుందన్నారు. ఉగాది పండుగరోజు సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ సహాయక చర్యల్లో పాలొంటున్న రెస్క్యూ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు.
మొదటి రోజు నుంచే టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ చేయగల ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ, ర్యాట్ హోల్ మైనర్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, కేరళ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్, రోబోటిక్ సహా అన్ని రకాల నిష్ణాతులను సాంకేతికతను ఉపయోగించుకుంటూ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ప్రత్యేకాధికారితోపాటు సహాయక చర్యలను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ దేవసహాయం, ఎన్డీఆర్ఎఫ్ అధికారి కిరణ్‌కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, దక్షిణమధ్య రైల్వే అధికారి నేటిచంద్ర, హైడ్రా అధికారులు పర్యవేక్షించారు.