– గుండాల కృష్ణ-మ్యాకం రవికుమార్
SLBC | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఫ్లోరైడ్‌పీడిత నల్లగొండ జిల్లా చిరకాల స్వప్నం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ(ఎస్ఎల్బీసీ) కాలగర్భంలో కలిసిపోయినట్టేనా? మనుషుల సంచారంపైనే నిషేధమున్న టైగర్ రిజర్వు ఫారెస్టులో భారీ యంత్రాలతో డ్రిల్లింగ్చేస్తే తప్ప సొరంగం ఇప్పుడున్న దశను మార్చుకొని ముందుకు పోయే పరిస్థితి లేనట్టేనా? టీబీఎం చిక్కుముడిలో ఇన్నాళ్లూ మూడడుగులు ముందుకు… ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగిన సొరంగం పనులకు శాశ్వతంగా బ్రేక్ పడినట్టేనా? నిపుణుల కమిటీతో పాటు ప్రభుత్వవర్గాల నుంచి అంతర్గతంగా వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు వీటికి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
రెండు నెలలకుపైగా రేయింబవళ్లు శ్రమించిన రెస్క్యూ బృం దాలు చివరి 40-50 మీటర్లలోకి వెళ్తే రిస్క్‌లో తప్పదనే నిపుణుల హెచ్చరిక తర్వాతే ప్ర భుత్వం మూడు నెలల విరామం ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఎలాగూ నెలన్నర రోజుల్లో వర్షాకాలమే మొదలవుతున్నందున సహాయ చర్యల పునరుద్ధరణ అనేది అసాధ్యం. దీంతో ప్రభుత్వ పెద్దలు సొరంగానికి ప్రత్యామ్నాయం గా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు సామర్థ్య పెంపుపై దృష్టిసారించినట్టు తెలిసింది.
ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా.. హైదరాబాద్ నగర నీటిసరఫరా పేరిట జలమండలి భుజంపై ఐదో మోటారు ప్రతిపాదనను పెట్టి అదనపు ఆయకట్టుకు సాగునీరిచ్చే ఏర్పాట్లు గుట్టుగా సాగుతున్నట్టు సమాచారం. మాధవరెడ్డి ప్రాజెక్టులోని కాల్వల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులకు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేస్తున్న ట్టు తెలిసింది. తద్వారా ఎస్ఎస్బీసీ ప్రాజెక్టు లక్ష్యం మేరకు మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారానే సాగునీరు ఇచ్చి కాలగమనంలో ‘సొరంగం’ను చెరిపివేసేలా పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతున్నది. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు పేరుతో ఇప్పటివరకు ఖర్చు చేసిన దాదాపు రూ.3-4వేల కోట్లు వృథా అయినట్టే.
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు గ్రావిటీ ప్రాతిపదికన రూపుదిద్దుకున్నదే శ్రీశైలం ఎడ మ గట్టు కాల్వ(ఎస్ఎస్బీసీ)ప్రాజెక్టు. ఐదున్నర దశాబ్దాలకుపైగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో సాగునీటి రంగంలో పట్టిన తరాజులో తెలంగాణ కోటా కింద మొగ్గు కో సం పురుడు పోసుకుంది. నిధులియ్యాలేగానీ…నీళ్లు కాదు! అనే సమైక్య సూత్రంలో భాగంగా ‘టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)’ అనే విషవలయంలో పెట్టి ఎస్ఎల్బీసీ పనులను మొదలుపెట్టారు. ముందుకు పోదు… వెనక్కి రాదు అన్నట్టుగా సాగిన సొరంగం పనుల్లో అత్యంత కీలకమైన ఎనిమిది మీటర్ల షియర్జోన్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కూడా అధ్యయనం లేకుండానే పనులు మొదలుపెట్టింది.
వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 11 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం, 7.5 టీఎంసీల నిల్వతో రిజర్వాయర్, రెండోదశ సొరంగ నిర్మాణం, ఓపెన్ కాల్వల పనులు పూర్తయ్యాయి. శ్రీశైలం నుంచి మొదలైన ఈ ఇన్లెట్ సొరంగంలో ఎనిమిది మీటర్ల షియర్జోన్ను గుర్తించడంతో పనులు నిలిచిపోయాయి. పకడ్బందీ అధ్యయనం, జాగ్రత్తలతో ముందుకుపోవాలని నిర్ణయించారు. ఆలోపు అవుట్లెట్ నుంచి పనులు కొనసాగించేందుకు చర్య లు తీసుకున్నా…టీబీఎం బేరింగ్ లేదంటూ నిర్మాణ సంస్థ మొండికేయటం,ఎన్నికలు రావడం… ఆపై కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది.
వచ్చీరాగానే కాంగ్రెస్ పాలకులు ఇన్లెట్… అవుట్లెట్ పనులు చేసి ఏడాదిన్నరలో సొరంగంలో కృష్ణాజలాలను పరుగులు పెట్టిస్తామని ప్రకటనలు చేశారు. కానీ నిర్మాణ సంస్థ టీబీఎం బేరింగ్ లేదంటూ అవుట్లెట్ పనుల్ని మొదలుపెట్టలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో హడావిడిగా ఇన్లెట్ పనులు మొదలుపెట్టి జాగ్రత్తలు లేకుండానే షియర్ జోన్‌లోనూ సొరంగాన్ని తవ్వింది. దీంతో అది ఒక్కసారిగా కుప్పకూలి…ఎనిమిది మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో ఫిబ్రవరి 22న 13.93 కి.మీ వద్ద షియర్‌జోన్ (పర్రెలు వారి వదులైన రాతిపొరలు) వద్ద పైకప్పు కూలిపోయింది. ఇప్పటికీ 63 రోజులు పూర్తయింది. ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా, ఆరుగురి అచూకీ అంతుచిక్కలేదు. కార్మికుల జాడను కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్లు, రోబో వినియోగం సహాయ చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి, టెక్నికల్ కమిటీ.. ఇలా అనేక ప్రకటనలతో కాలయాపన తప్ప పురోగతి లేదు. ప్రమాద ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి రెస్క్యూ ఆపరేషన్‌కు తెరదించింది. కంటితుడుపుగా సహాయ చర్యలను కొనసాగిస్తున్నామని చెప్తున్నా, రెస్క్యూ బృందాలు తరలిపోతుండడం గమనార్హం.
అధ్యయనం చేయకుండా ఎస్ఎల్బీసీ సొ రంగంలో సహాయక చర్యలను కొనసాగించడం కష్టమేనని సర్కారు ఏర్పాటుచేసిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. అచూకీ లభించని ఆరుగురు కార్మికులు మృతిచెందారని అధికారికంగా ప్రకటించడంతోపాటు, బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహా రం అందించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. తదుపరి కార్యాచరణపై అధ్యయనం కోసం నిపుణులతో మరో సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్‌లోనూ సొరం గం పనులను టీబీఎం ద్వారా చేపట్టడం కష్టమేనని, కేవలం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) మెథడ్ ఒక్కటే శరణ్యమని కమిటీ తెలిపింది. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పథకం పూర్తయినా కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు తక్కువ మోతాదులోనే ఉంటుంది. కానీ ఇప్పు డు సొరంగం పూర్తయ్యే పరిస్థితి లేనందున అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని ఎలా సమకూర్చాలనే దానిపై ప్రభుత్వం అంతర్గం గా తీవ్ర కసరత్తు చేస్తున్నది. మాధవరెడ్డి ప్రాజె క్టు సామర్థ్యాన్ని పెంపు, విస్తరణతో ఎస్సెల్బీసీ లక్ష్యం మేరకు ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని ప్రణాళిక రూపొందిస్తున్నారు.
పర్యావరణ మంత్రిత్వశాఖ విధించిన షరతుల మేరకు అధ్యాయనం చేసి పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సిఫార్సులను చేసేందుకు సాంకేతిక నిపుణులతో మరో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. సొరంగ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా నేతృత్వంలో సైట్-నిర్దిష్ట నివేదికను సమర్పించే బాధ్యతను ఉపకమిటీని అప్పగించింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ఆరుగురు కార్మికుల మృత దేహాలను బయటకు తీయకుండానే మూడు నెలలు సహాయక చర్యలు నిలిపివేయడం అత్యంత దుర్మార్గం.
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్‌లో ఒక పిల్లర్ కుంగుబాటుకు గురైంది. డిజైన్ లోపాలు, అధ్యయనాలు చేయలేదంటూ కాంగ్రెస్ నానాయాగీ చేసింది. ప్రాజెక్టు నిరర్థకమని ముద్ర వేస్తున్నది. సాంకేతిక కారణాలను చూపుతూ పునరుద్ధరణ పనులను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. అదే కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై, నిర్లక్ష్యంతో ప్ర మాదం సంభవించినా కూడా ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని విపత్తుగా సమర్థించుకున్నది. నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పనులను పునఃప్రారంభించింది. వెరసి భారీ సీపేజీ రావడంతోపాటు, అంచనాలు తప్పి సొరంగం కుప్పకూలింది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టునే పక్కపెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది.
మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటిని లిఫ్టు చేయకుండా శాశ్వత పరిష్కారంగా గ్రావిటీ మీద సాగునీరు అందించేందుకే ఎస్సెల్బీసీ ప్రాజెక్టును రూ పొందించారు. శ్రీశైలం నుంచి సొరంగం ద్వారా తరలించే కృష్ణాజలాలను చివరకు మాధవరెడ్డి ప్రాజెక్టులోని ప్రధాన కాల్వకు అనుసంధానిస్తారు. తద్వారా మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుతో పాటు దిగువన ఉదయ సముద్రం ప్రాజెక్టుకు నీరు అంది లక్ష ఎకరాలకు జీవం వస్తుంది. అందుకే ఎస్ఎల్బీసీకి ప్రత్యామ్నాయంగా గుట్టుగా కసరత్తు చేపడుతున్నది.