SLBC Tunnel | నాగర్ కర్నూల్, మార్చి 28: నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు సొరంగంలో కూలిన మట్టిలో చిక్కుకుపోయి నేటికీ ఐదు వారాలు గడిచిపోయింది. ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల ద్వారా కేవలం ఇద్దరిని మాత్రమే బయటకు తీయగలిగారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్, క్యాడవార్ డాగ్స్ వంటి రెస్క్యూ టీంలు దాదాపు 600 మంది.. మూడు స్విఫ్ట్ల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. సొరంగంలో కార్మికులపై కూలిన మట్టిని తొలగించేందుకు రెస్క్యూ టీంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఉబికి వస్తున్న ఊట నీటితో సొరంగమంతా బురదమయంగా మారడంతో పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తుంది. అయినప్పటికీ కన్వేర్ బెల్ట్ సహాయంతో బురద మట్టిని ఎప్పటికప్పుడు బయటకు తరలిస్తున్నారు. కార్మికుల మృతదేహాలను గుర్తించేందుకు అడ్డుగా ఉన్న బోరింగ్ మిషన్‌ను కటింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ ద్వారా శకలాలను బయటకు పంపిస్తున్నారు. ఇటీవల లభ్యమైన మనోజ్ కుమార్ మృతదేహానికి సమీపంలో మరో డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ బృందాలు బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి. కార్మికులకుపై పడిన బురద మట్టి, సున్నం మట్టి బిగుసుకుపోవడంతో మట్టిని తొలగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
గురువారం కేడవార్ డాగ్స్‌ను తెప్పించి మరోసారి సొరంగంలో పరిశీలించినా దుర్వాసన వల్ల మృతదేహాలను గుర్తించకపోయినట్టు తెలుస్తుంది. శుక్రవారం ఏడున్నర గంటల ప్రాంతంలో రెస్క్యూ బృందాలు మరోమారు టన్నెల్లోకి సహాయక చర్యలు చేపట్టేందుకు బయలుదేరాయి. రెస్క్యూ బృందాలు మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మనోజ్ కుమార్ మృతదేహానికి సమీపంలో ఉన్న మరో వ్యక్తి డెడ్ బాడీ వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం శివశంకర్ అనే ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. గత మూడు రోజులుగా ఆయన సమక్షంలోనే రెస్క్యూ బృందాలు సొరంగంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.