రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగర్వాల్ సీరియస్ అయ్యారు. ‘రామాలయం రాసిచ్చిండ్రు’ అనే శీర్షికన అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ నేత నిర్వాకంపై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీతారామాలయం గ్రామ పంచాయతీ ఆస్తి అని, ఓ వ్యక్తికి చెందిన ఆస్తిగా సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారంటూ మంగళవారం నీలోజుపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, గ్రామస్తులు కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
బోయినపల్లి తహసీల్దార్, ఆర్ఐతోపాటు కాంగ్రెస్ నేత కూస రవీందర్ నిర్వాకంపై వివరించగా కలెక్టర్ స్పందించి, తహసీల్దార్, ఆర్‌ఐలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్టు సర్పంచ్ తెలిపారు. కూస రవీందర్.. బోయినపల్లి తహసీల్దార్‌కు తప్పుడు సమాచారం అందించి, దేవాలయం వ్యక్తిగత నిర్మాణమని పేర్కొని దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ సరైన పరిశీలన లేకుండా సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. దాన్ని రద్దు చేసి ఆలయం పంచాయతీ ఆస్తి అని ప్రకటించాలని కోరారు.