Betting App | ఎల్లారెడ్డిపేట, మార్చి 27 : కష్టమంటే తెలియకుండా పెంచి ఉన్నత చదువులు చదివిస్తే బెట్టింగ్ వ్యసనంగా మార్చుకుని అప్పులపాలైన కొడుక్కి ధైర్యం చెప్పేందుకు ఉన్న భూమి అమ్మేశారు. అయినా, అప్పు తీరలేదని.. తనలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావొద్దని.. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయాలని ఓ తల్లి ప్రభుత్వాన్ని వేడుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన వంగల శోభ-లింగారెడ్డి దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు వినయ్‌రెడ్డిని 2020లో హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివేందుకు పంపించారు. మొదటి సంవత్సరం బాగా చదివి మంచి మార్కులు సాధించినప్పటికీ అప్పుడే క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. అదే ఏడు కరోనా ఖాళీ సమయమంతా దానితోనే గడిపేవాడు. 2024 నాటికి పూర్తి వ్యసనంగా మారి తెలిసిన ప్రతి ఒక్కరి వద్ద అప్పు చేశాడు. ఇలా రూ.30 లక్షలు చేయగా, అందరూ అప్పు తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. దీంతో కొంతకాలంగా ఇంట్లో మౌనంగా ఉంటున్న కొడుకును చూసి ఆరా తీయగా తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
బయట తెలిస్తే పరువు పోతుందని అష్టకష్టాలు పడి అప్పుతీర్చారు. కొన్ని రోజులుగా టీవీలు, వార్తాపత్రికల్లో బెట్టింగ్యాప్లపై వస్తున్న కథనాలను చూసిన వినయ్‌రెడ్డి తల్లి శోభ మీడియాను ఆశ్రయించింది. తన కొడుకు లాగా ఎవరూ బెట్టింగ్‌కు అలవాటు పడవద్దని సూచించింది. చివరకు తమకున్న 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మి కొంత వరకు అప్పు తీర్చినట్టు చెప్పింది. ఇంకా అప్పులవాళ్లు అడుగుతూనే ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయాలని చేతులెత్తి వేడుకున్నది. తమ కొడుకు లాంటి బాధిత యువకులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరింది. బాధిత యువకుడు మాట్లాడుతూ తాను బీటెక్ జాయిన్ అయిన కొత్తలో వన్ ఎగ్జిబిట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డానని, కరోనా సమయంలో ఈ యాప్ ద్వారా రూ.6 లక్షలు పోగుట్టుకున్నట్టు తెలిపాడు. అనంతరం ఫెయిర్ ప్లే యాప్‌కు అలవాటుపడి 2023లో రూ.22 లక్షల వరకు పోగొట్టుకుని బీటెక్ ఫెయిలై మానసికంగా దెబ్బతిన్నట్టు వివరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మళ్లీ కోలుకుని చదువుతున్నానని చెప్పాడు. తనలాగా ఎవరూ బెట్టింగ్‌కు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరాడు.