కొల్లాపూర్ : గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల ముందు అధికారులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. పట్టణ కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ బీఆర్ఎస్ శ్రేణుల భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీలో కలసి పట్టణంలో పలుచోట్ల జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భం గాఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం వల్లే నేడు సామాన్యుడికి సైతం సమాన హక్కులు, రక్షణ దక్కుతున్నాయని కొనియాడారు.1950 జనవరి 26న మన దేశం పరిపూర్ణ గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా నవ సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.