హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కవాతుతో కూడిన వేడుకలు జరుగుతాయని తెలిపింది. గురువారం ఉదయం 7 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిషరిస్తారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్షించారు. రాజ్‌భవన్‌లో పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం పోలీసు, ఇతర శాఖల అధికారులు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు బలగాలు రాజ్‌భవన్ ప్రాంగణంలో రిహార్సల్స్ కూడా నిర్వహించాయి. సమీక్షలో డీజీపీ అంజనీకుమార్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ప్రొటోకాల్ సంచాలకుడు అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.