హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యంతోనే సామాజిక మార్పు సాధ్యమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. మంగళవారం బేగంపేట హోటల్ హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ కన్వీనర్ (ఐడీజేఎన్) మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మొదటి అంతర్జాతీయ దళిత్ మీడియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆన్లైన్ వేదికగా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు ప్రారంభించగా.. ఐడీజేఎన్ జనరల్ సెక్రటరీ రెమ్ బహదూర్ (నేపాల్), పుష్ప కుమార్ (పాకిస్థాన్) ప్రసంగించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ.. మీడియా సంస్థల్లో దళితుల ప్రాతినిధ్యం అంతంత మాత్రమేనని, పత్రికారంగంలో వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయన్నారు. జాతీయవాదం పేరుతో దేశానికి పెనుముప్పు ముంచుకొస్తున్నదని, అణగారినవర్గాలు చైతన్యవంతమై ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. 80వ దశకంలో వేళ్లమీద లెక్కపెట్టే విధంగా దళిత జర్నలిస్టులు ఉండేవారని, ప్రస్తుతం చెప్పుకోదగిన సంఖ్యలో ఉండటం సంతోషించాల్సిన అంశమని అన్నారు. గతంలో దళిత జర్నలిస్టులను వెతుక్కొనే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిందని బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ ప్రాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ కృష్ణ, ఇఫ్లూ ప్రొఫెసర్ సంతోశ్, ఐడీజేఎన్ ప్రతినిధులు జనార్దన్, సంజీవ్, జాన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రతినిధిప్రతీక్ తదితరులు పాల్గొన్నారు.